Agnipath: యువతను కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టిస్తోంది: మాజీ సైన్యాధిపతి వీకే సింగ్‌

అగ్నిపథ్‌ను (Agnipath) వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగించాలని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పిలుపునివ్వడం పట్ల కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి జనరల్‌ వీకే సింగ్‌ (రిటైర్డ్‌) మండిపడ్డారు.

Published : 20 Jun 2022 02:09 IST

నాగ్‌పూర్‌: అగ్నిపథ్‌ను (Agnipath) వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగించాలని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పిలుపునివ్వడం పట్ల కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి జనరల్‌ వీకే సింగ్‌ (రిటైర్డ్‌) మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తప్పులు వెతుకుతోందని విమర్శించారు. రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారిస్తుండడంతో తీవ్ర కలత చెందుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఇలా యువతను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని దుయ్యబట్టారు. నాగ్‌పూర్‌లో పర్యటనలో ఉన్న జనరల్‌ వీకే సింగ్‌..  నిరుద్యోగులు నిరసనలు ఆపొద్దని ప్రియాంక గాంధీ చేసిన ప్రకటనపై ఇలా స్పందించారు.

‘కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుండడంతో ఆ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోంది. అందుకే మోదీ ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా అందులో తప్పులు వెతుకుతోంది. ముఖ్యంగా అగ్నిపథ్‌ విషయంలో ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) యువతను తప్పుదోవ పట్టిస్తోంది. కేవలం ప్రభుత్వ పథకాలను విమర్శించడం, అవి అమలు కాకుండా వ్యతిరేకించడం మాత్రమే వారి చేతిలో మిగిలిపోయాయి. ప్రభుత్వ పేరును చెడగొట్టి దేశంలో అశాంతి సృష్టించాలని వారు కోరుకుంటున్నారు’ అని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం వల్ల దేశ యువత నష్టపోతోందంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald) పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారిస్తోంది. ఇప్పటికే వరుసగా మూడు రోజులు విచారించిన ఈడీ.. సోమవారం కూడా మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రాహుల్‌ గాంధీని విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇదే సమయంలో అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ యువత ఆందోళన చేపట్టడంతో వారికి కూడా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని