Petrol Hike: 16 రోజుల్లో రూ.10 పెంపు.. ఇది సామాన్యుడిని ‘లూటీ’ చేయడమే!

మార్చి 22 నుంచి ఇంధన ధరలు పెరగడం ఇది 14వ సారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ 16 రోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌పై రూ.10 (పది శాతం) పెరిగాయి.

Published : 06 Apr 2022 17:19 IST

భాజపాపై విపక్షాల ఆరోపణలు

ముంబయి: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుదల నిత్యం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం నాడు లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరో 80పైసలు పెరిగాయి. ఇలా మార్చి 22 నుంచి ఇంధన ధరలు పెరగడం ఇది 14వ సారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ 16 రోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌పై రూ.10 (పది శాతం) పెరిగాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్‌ ధర రూ.120కి చేరువకాగా డీజిల్‌ కూడా వంద దాటింది. ఇలా రికార్డు స్థాయిలో పెరుగుతోన్న ఇంధన ధరలతో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిని లూటీ చేస్తోందని కాంగ్రెస్‌, ఎన్‌సీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

‘ధరల పెరుగుదలతో పేద ప్రజలను మోదీ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. మరోసారి 80పైసలు పెంచడంతో రెండు వారాల్లోనే రూ.10 పెరిగింది’ అని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాజపా ప్రభుత్వాన్ని ఆయన ‘జేబుదొంగ’ అంటూ అభివర్ణించారు. మరోవైపు రికార్డు స్థాయిలో ఇంధన ధరల పెంపుతో సామాన్యులను భయాందోళనలకు గురిచేస్తోందని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో విమర్శించారు. ఇలా ప్రజల జేబులు కాజేస్తోన్న కాషాయ పార్టీని ‘లూట్‌జీవి (Lootjeevi)’ అంటూ పేర్కొన్న ఆయన.. ఇప్పటివరకు పెంచింది చాలు అని అన్నారు.

ఇదిలాఉంటే, మార్చి 22కు ముందు 137 రోజులపాటు దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే మొదలైన పెట్రో వడ్డన.. క్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో పక్షం రోజుల్లోనే లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.పది రూపాయలు పెరిగాయి. ఇలా గడిచిన 16 రోజుల్లోనే 14 సార్లు పెరిగిన ఇంధన ధరలు పదిశాతం పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలోనే పెట్రో ఉత్పత్తుల ధరలు స్వల్పంగానే పెరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంటోంది. ఆయా దేశాల్లో 50శాతం మేర పెరగగా.. మనదగ్గర కేవలం 5శాతం మాత్రమేనని చెబుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పెట్రో ధరల ప్రభావం ప్రపంచ దేశాలపై ఉందని వెల్లడిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని