ఆ ‘కమీషన్‌’పై దర్యాప్తు జరపాల్సిందే : కాంగ్రెస్‌

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలో వాటి తయారీ సంస్థ ఓ మధ్యవర్తికి 1.1 మిలియన్‌ యూరోలను ‘కమీషన్‌’గా ఇచ్చినట్లు ఫ్రెంచ్‌ మీడియాలో వచ్చిన కథనం  కలకలం రేపుతోంది. 

Updated : 05 Apr 2021 19:37 IST

ఫ్రాన్స్‌ మీడియా కథనం

దిల్లీ: అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకుంటున్న వేళ, వాటి కొనుగోలుపై దుమారం మొదలైంది. వాటి కొనుగోలు సమయంలో రఫేల్‌ తయారీ సంస్థ ఓ మధ్యవర్తికి 1.1 మిలియన్‌ యూరోలను ‘కమీషన్‌’గా ఇచ్చినట్లు ఫ్రెంచ్‌ మీడియా కథనం పేర్కొనడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రఫేల్‌ ముడుపుల వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పడంతో పాటు, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

రఫేల్‌ కొనుగోలు వ్యవహారంలో తాము తొలినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని, ప్రస్తుతం అదే నిజమైందని కాంగ్రెస్‌ ఆరోపించింది. వీటిపై తమపార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తోన్న ఆరోపణలు సరైనవేనని తాజా ఫ్రెంచ్‌ మీడియా కథనం ద్వారా తెలుస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. ఫైటర్‌ జెట్‌ల కొనుగోలు వ్యవహారంలో వాటి తయారీ సంస్థ డసాల్ట్‌ ఏవియేషన్‌ భారత్‌కు చెందిన డెఫ్‌సిస్‌కు 1.1 మిలియన్‌ యూరోలు ‘కమీషన్‌’గా ఇచ్చినట్లు ఫ్రెంచ్‌ అవినీతి నిరోధక సంస్థ ఆడిటింగ్‌లో తేలడమే దీనికి రుజువని పేర్కొన్నారు. ఆ ఖర్చులను ‘వినియోగదారులకు బహుమతులు’గా డసాల్ట్‌ ఏవియేషన్‌ చూపించడం విడ్డూరమని విమర్శించారు.

రక్షణ శాఖకు చెందిన ప్రతి కొనుగోలు ఒప్పందంలో ఎటువంటి మధ్యవర్తులు, కమీషన్లు, అవినీతి ఉండకూడదని రక్షణశాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఇలాంటివి బయటపడితే సంబంధిత సరఫరా సంస్థను నిషేధించడం, ఒప్పందం రద్దు చేయడం, కేసు నమోదు చేయడం లాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయని సుర్జేవాలా గుర్తుచేశారు. ప్రభుత్వ ఒప్పందంలో నిబంధనలకు విరుద్ధమైన మధ్యవర్తుల ప్రమేయం, కమీషన్‌లాంటి వాటిని ఎలా అనుమతించారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి నివేదికలు వస్తోన్న సమయంలో వీటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

ఫ్రెంచ్‌ మీడియా‌ కథనం..

రఫేల్‌ యుద్ధ విమానాలను భారత్‌కు అందించే ఒప్పందంలో వాటి తయారీ సంస్థ డసాల్ట్‌ ఏవియేషన్‌ భారత్‌లోని ఓ మధ్యవర్తికి దాదాపు 1.1 మిలియన్‌ యూరోలు(దాదాపు రూ.8.6 కోట్లు) కమీషన్‌గా ఇచ్చినట్లు ఏప్రిల్‌ 4న ఫ్రెంచ్‌ మీడియా  ‘మీడియా పార్ట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన అవినీతి నిరోధక సంస్థ(ఏఎఫ్‌ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయాలు తేలినట్లు అది వెల్లడించింది. మరొక రక్షణ ఒప్పందంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఆ మధ్యవర్తి అని కూడా తెలిపింది. అయితే రఫేల్‌ నమూనా విమానాల తయారీకే ఆ డబ్బును ఉపయోగించినట్లు డసాల్ట్‌ వివరణ ఇచ్చినట్లు అందులో పేర్కొంది. పలు దఫాల్లో ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలు చేరుకుంటున్న సమయంలోనే ఈ వార్తలు రావడం భారత రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని