Rahul Gandhi: పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనర్హత వేటుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఆదివారం దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద సత్యాగ్రహ దీక్షను ప్రారంభించింది.

Updated : 26 Mar 2023 13:12 IST

Rahul Gandhi | దిల్లీ: లోక్‌సభ నుంచి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఒకరోజు ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ను ప్రారంభించింది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర నేతలంతా కలిసి నిరసన దీక్షకు దిగారు. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్‌ నేతలు చిదంబరం, సల్మాన్‌ ఖుర్షీద్‌, జైరామ్‌ రమేశ్‌, పవన్‌ కుమార్‌ బన్సల్‌, ముకుల్‌ వాస్నిక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దిల్లీ కాంగ్రెస్‌ శాఖకు చెందిన పలువురు నేతలు కూడా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అయితే, పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను మాత్రం పోలీసులు అనుమతించడం లేదు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా రాజ్‌ఘాట్‌ దగ్గర సత్యాగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వలేమని తెలియజేస్తూ దిల్లీ పోలీసులు కాంగ్రెస్‌ పార్టీకి లేఖ రాశారు. అలాగే ఆ ప్రాంతంలో సెక్షన్‌ 144 విధిస్తున్నట్లు ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
(ఇదీ చదవండి: జైలుకు పంపినా... ప్రశ్నిస్తూనే ఉంటా: రాహుల్‌ గాంధీ)

పోలీసుల అనుమతి నిరాకరణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ స్పందించారు. ‘‘పార్లమెంటులో మా గొంతునొక్కిన ప్రభుత్వం.. ఇప్పుడు మహాత్మాగాంధీ సమాధి వద్ద శాంతియుతంగా దీక్షను చేపట్టడానికి కూడా అనుమతించడం లేదు. ప్రతిపక్షాల నిరసనను అణచివేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. వారు మమ్మల్ని ఆపలేరు. సత్యం కోసం నిరంకుశపాలనపై పోరాడుతూనే ఉంటాం’’ అని అన్నారు.

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు 2023 మార్చి 23న రాహుల్‌ (Rahul Gandhi)కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం మార్చి 24న ఆగమేఘాలపై స్పందించింది. ఈ నెల 23 నుంచే రాహుల్‌ అనర్హత అమల్లోకి వచ్చినట్లు స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని అధికరణం 102(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌సింగ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ట్విటర్‌ బయో మార్చిన రాహుల్‌..

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన ట్విటర్‌ బయోను మార్చారు. తనని తాను ‘అనర్హతకు గురైన ఎంపీ’గా అభివర్ణించుకున్నారు. అయితే, ఇంగ్గిష్‌లో ‘డిస్‌క్వాలిఫైడ్‌’ అని రాస్తూనే.. ‘డిస్‌’, ‘క్వాలిఫైడ్‌’ (Dis'Qualified) మధ్య సంగ్రాహక చిహ్నాన్ని (Apostrophe) ఉంచడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని