Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
కర్ణాటక అసెంబ్లీ (Karnataka Elections) ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యింది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థులను (Chief Minister) ప్రకటించడంపై మౌనంగానే ఉన్నాయి. కాంగ్రెస్, భాజపాలోనూ ఇదే తీరు కనిపిస్తోంది.
బెంగళూరు: కర్ణాటక ఎన్నికలకు (Karnataka Elections) ముహూర్తం ఖరారైన క్రమంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టోలపై కసరత్తు చేస్తున్నాయి. ఇంత వరకు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి పేరును (Chief Minister) ముందస్తుగా ప్రకటించే విషయంలో మాత్రం రెండు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. భాజపాలో యడియూరప్ప (BS Yediyurappa), బసవరాజ్ బొమ్మైలు కీలక నేతలుగా ఉండగా.. తనకు 80ఏళ్లు పైబడినందున ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని యడ్డీ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో మాత్రం సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ వంటి సీనియర్లు సీఎం రేసులో ఉంటామని చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రస్తావన లేకుండానే ఈ రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్తాయా అనే అంశం ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్‌లో.. సిద్ధా వర్సెస్ శివకుమార్
ఇతర పార్టీలతో పోలిస్తే కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటనలు చేస్తుండగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోపాటు జీ.పరమేశ్వర వంటి సీనియర్లు కూడా సీఎం అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై శివకుమార్, పరమేశ్వరలు గతంలో పలు సందర్భాల్లో సీఎం అభ్యర్థిత్వంపై తమ మనసులో మాటను బయటపెట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం కాంగ్రెస్ ఎప్పుడూ ప్రకటించదని సిద్ధరామయ్య చెబుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలో సీఎం ఆశావహుల్లో తాను ఒకడినని స్పష్టం చేశారు. ఇతర నేతలకు కూడా ఆసక్తి ఉన్నమాట వాస్తవమేనని.. అందులో తప్పేమీ లేదన్నారు.
భాజపా.. సీఎం పేరు ప్రస్తావన లేకుండానే..?
భాజపా సీనియర్ నేత యడియూరప్ప సుమారు ఐదు దశాబ్దాలుగా అక్కడి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కర్ణాటకలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చే స్థాయికి చేర్చడంలో ఆయన పాత్ర కీలకమనే చెప్పవచ్చు. యడ్డీని పక్కకుపెట్టిన భాజపా అధిష్ఠానం.. చివరకు బసవరాజ్ బొమ్మైను సీఎంగా కొనసాగిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. అయినప్పటికీ రాజకీయాలకు దూరం అయినట్లు కాదని యడియూరప్ప చెబుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా భాజపా ఎవరిని ప్రతిపాదించి ఎన్నికలకు వెళ్తుందనే విషయం ఆసక్తిగా మారింది.
కర్ణాటకలో లింగాయత్ వర్గంలో గట్టి పట్టున్న నేతగా యడియూరప్పకు పేరుంది. యడ్డీతో పోలిస్తే ముఖ్యమంత్రి బొమ్మైకి.. వారిని ఆకట్టుకునే చరిష్మా లేదనే అభిప్రాయం ఉంది. పార్టీకి ఆ వర్గం మద్దతు లభించాలంటే మాత్రం యడ్డీని ప్రచారంలో ముందుంచాల్సిందే. మరోవైపు వొక్కళిగ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మద్దతూ భాజపాకు అవసరం. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి పేరును పార్టీ ప్రకటించకపోవచ్చని.. ఒకవేళ ఎన్నికల్లో మళ్లీ భాజపా విజయం సాధిస్తే బొమ్మైనే మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే పరిస్థితి రెండు పార్టీల్లోనూ కనిపించడం లేదని తెలుస్తోంది. అయితే, దీనిపై ఆయా పార్టీల అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు