Congress: సుప్రీం కోర్టు మాజీ జడ్జితో విచారణ జరిపించాలి: కాంగ్రెస్‌

తీగల వంతెన కూలిన ఘటనపై మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై తాము రాజకీయం చేయబోమని పేర్కొంది. 

Updated : 31 Oct 2022 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘటనపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు మాజీ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం ఆర్థిక, వైద్య సాయం అందించాలని కోరింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 130 మందికి పైగా మరణించారు. ఈ ఘటనలో మృతులకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. బాధితుల కుటుంబాలకు ఈ కష్టాన్ని తట్టుకొనే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని ఆయన ప్రార్థించారు. ఖర్గే విలేకర్లతో మాట్లాడుతూ.. ఐదు రోజుల క్రితమే సందర్శకుల కోసం వంతెనను తెరిచారని, ఈ నేపథ్యంలో అంతమందిని వంతెనపైకి ఎలా అనుమతించారనే విషయం తెలియాల్సి ఉందన్నారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం, సాయం అందజేసి ఆదుకోవాలని ఖర్గే కోరారు. గాయపడిన వారికి తగిన చికిత్సను అందించాలన్నారు. ‘‘కాంగ్రెస్‌ నాయకులు అక్కడికి చేరుకొన్నారు. అశోక్‌ గహ్లోత్‌ కూడా వెళ్లారు. వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఈ అంశంపై మేము రాజకీయం చేయం. ప్రస్తుతానికి ఎవరినీ నిందించం. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే తప్పు ఎవరిదో తేలుతుంది’’ అని ఖర్గే పేర్కొన్నారు.  

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా ఆ సంఖ్య 132కు చేరింది. సహాయక చర్యల కోసం ఇక్కడికి చేరుకొన్న నావికాదళం, వాయుసేన, సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటి వరకు 177 మందిని రక్షించినట్లు గుజరాత్‌ సమాచార శాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని