50ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసింది: కేంద్రమంత్రి

కాంగ్రెస్‌ యాభై ఏళ్ల పాటు దేశాన్ని పాలించింది.. కానీ వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టడంలో విఫలమైందని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఆరోపించారు. రైతుల ఆందోళనలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Published : 06 Dec 2020 02:33 IST

దిల్లీ: యాభై ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టడంలో విఫలమైందని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఆరోపించారు. రైతుల ఆందోళనలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించింది. కానీ రైతులు, వ్యవసాయ రంగంలో ఎలాంటి సంస్కరణలు చేపట్టలేదు. రైతుల ప్రయోజనాల కోసం వారు ఎలాంటి చట్టాల్ని తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ రైతుల ప్రయోజనాల కోసం పథకాలు తీసుకువస్తే అభ్యంతరాలు చెబుతూ విమర్శలు చేస్తూ తప్పుదోవపట్టిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి మోదీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొందరు వాటిని రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఈ రైతు చట్టాలు మన రైతులకు, వ్యవసాయానికి ఎంతో కీలకమైనవి. ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సానుకూల వైఖరి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది’ నఖ్వీ అన్నారు.

తాజాగా విడుదలైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల గురించి నఖ్వీ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. ప్రజలు మా పాలనను గౌరవించి.. స్వాగతించారు. హైదరాబాద్‌ ప్రజలు అభివృద్ధిపై ఆశతో భాజపాపై విశ్వాసాన్ని కనబరిచారు’ అని అన్నారు.  కాగా శనివారం కేంద్ర ప్రభుత్వంతో రైతులు మరోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీ కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌ సహా పలువురితో కీలక సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి

వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని