PM Modi: నాకు సమాధి కట్టాలని కాంగ్రెస్‌ కలలు కంటోంది.. కానీ..!

తనకు గొయ్యి తీసి, సమాధి కట్టాలనే కలలు కనడంలో కాంగ్రెస్‌ నేతలు బిజీగా ఉన్నారని.. అయితే, తాను మాత్రం దేశాభివృద్ధిలో తలమునకలై ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించారు.

Updated : 12 Mar 2023 17:00 IST

బెంగళూరు: తనకు గొయ్యి తీసి సమాధి కట్టాలని  కాంగ్రెస్‌(Congress), కలలు కంటోందని.. తాను మాత్రం దేశాభివృద్ధి, పేదల వికాసంలో నిమగ్నమై ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) వ్యాఖ్యానించారు. కర్ణాటక(Karnatka)లోని మాండ్య(Mandya) జిల్లాలో బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే(Bengaluru- Mysore Expressway)ను ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు.

‘దేశాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి డబుల్ ఇంజిన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయి? మోదీకి సమాధి తవ్వాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కానీ, దేశ ప్రజల ఆశీర్వాదం నాకు రక్షణ కవచంగా పనిచేస్తుందని వారికి తెలియదు. మోదీకి గోతులు తవ్వాలనే కలలు కనడంలో వారు(కాంగ్రెస్ నేతలు) బిజీగా ఉన్నారు. మరోవైపు.. బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడంలో, పేదల జీవితాలను బాగుపరచడంలో నేను బిజీగా ఉన్నా’నని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది ఆరోసారి. ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవానికి ముందు మాండ్య జిల్లా కేంద్రంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా.. బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును రూ.8480 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. 118 కి.మీల పొడవైన ఈ రహదారి.. ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటల నుంచి దాదాపు 75 నిమిషాలకు తగ్గిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు