Ghulam Nabi Azad: అవతలి పక్షం గుర్తించింది.. కాంగ్రెస్‌కు మాత్రం అవసరం లేదు

కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించడంపై.. సీనియర్ సహచరుడు కపిల్ సిబల్ స్పందించారు.

Updated : 26 Jan 2022 14:03 IST

దిల్లీ: కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించడంపై.. సీనియర్ సహచరుడు కపిల్ సిబల్ స్పందించారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను దేశం గుర్తించినప్పుడు సొంత పార్టీకి ఆయన సేవలు అవసరం లేదని వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పు అవసరమంటూ ఎత్తిచూపిన 23 మంది (జీ-23)లో ఆజాద్‌, సిబల్‌ కూడా ఉన్నారు.  

ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఆజాద్‌ చేసిన సేవలకుగానూ కేంద్రం నిన్న పద్మ అవార్డును ప్రకటించింది. దీనిపై సిబల్‌ తాజాగా ట్వీట్ చేశారు. ‘గులాం నబీ ఆజాద్‌ను పద్మ భూషణ్ పురస్కారం వరించింది. నా సోదరుడికి శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో ఆయన సేవలను దేశం గుర్తించగా.. కాంగ్రెస్‌కు ఆయన సేవలు అవసరం లేదు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా ఆజాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అవతలి పక్షం ప్రభుత్వం కూడా ఒకరి ప్రజాసేవను గుర్తించడం బాగుందని థరూర్ వ్యాఖ్యానించారు. 

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. నలుగురికి పద్మవిభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కాగా, పశ్చిమ్ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్యకు కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించగా.. ఆయన దాన్ని తిరస్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని