Jairam Ramesh: ‘కొత్త పార్లమెంట్‌ మోదీ మల్టీప్లెక్స్‌’.. జైరాం రమేశ్‌ విమర్శలకు భాజపా కౌంటర్‌

‘కొత్త పార్లమెంట్‌ మోదీ (PM Modi) మల్టీప్లెక్స్‌’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు భాజపా కౌంటర్‌ ఇచ్చింది. 

Updated : 23 Sep 2023 16:20 IST

దిల్లీ: నూతన పార్లమెంట్‌ (new parliament) మోదీ (PM Modi) మల్టీప్లెక్స్‌ (Multiplex) అని కాంగ్రెస్‌ (Congress) విమర్శించింది. నూతన భవనంలో చర్చలు కనుమరుగయ్యాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. కొత్త పార్లమెంట్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు భాజపా (BJP) గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

‘‘నూతన పార్లమెంట్‌ మోదీ మల్టీప్లెక్స్‌ లేదా మారియట్. కొత్త భవనంలో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో చాలా విషయాలను గమనించా. ఈ భవనం ప్రధాని మోదీ లక్ష్యాలను చాలా బాగా అర్థం చేసుకోగలిగింది. చట్ట సభల్లో చర్చలు కనుమరుగైనట్లుగా అనిపిస్తోంది. పార్లమెంట్‌ ఆవరణలో కూడా ఇదే కొనసాగుతోంది. రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయకుండానే ప్రధాని విజయం సాధించారు’’ అని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన పాత పార్లమెంట్‌ను గుర్తు చేసుకున్నారు.

బలమైన ప్రభుత్వం వల్లే.. మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై మోదీ

పాత పార్లమెంట్‌లో ప్రతి సభ్యుడితో చర్చలు జరిపే అవకాశం ఉండేదని అన్నారు. ప్రస్తుతం సభ్యులను చూసేందుకు బైనాక్యులర్‌ అవసరం ఉంటుందేమో అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవి సమావేశాలను చర్చలను బలహీనపరుస్తాయని ఆరోపించారు. గతంలో సెంట్రల్‌ హాల్‌, కారిడార్లలో నడిచేందుకు వీలు ఉండేదని.. ఇక్కడ చాలా ఇరుకుగా ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు. మళ్లీ పాత పార్లమెంట్‌ వెళ్లేందుకు ఎదురుచూస్తుంటాను అని కాంగ్రెస్‌ నేత అన్నారు.

ఇది భారతీయులను అవమానించడమే

జైరాం రమేశ్‌ చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ పాటించే అత్యల్ప ప్రమాణాల్లో ఇదీ ఒకటి. ఈ చర్య ద్వారా కాంగ్రెస్‌ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానిస్తోంది. పార్లమెంటుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆ పార్టీకి ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఈ విధంగా మాట్లాడి విమర్శల పాలైంది’’అని కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని