Updated : 10 Aug 2022 11:02 IST

India Corona: కాంగ్రెస్‌లో కరోనా కలకలం.. నిన్న ఖర్గే..నేడు ప్రియాంక

దిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు మరోసారి వైరస్‌ సోకినట్లు ఆమె ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు.. అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. నిన్న హస్తం పార్టీకి చెందిన సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే కూడా తనకు మరోసారి కరోనా సోకినట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఖర్గే రెండ్రోజుల క్రితం రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి వీడ్కోలు కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌ ఓం బిర్లాతోపాటు పలువురు ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమయంలో ఖర్గేకు పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.

మరోపక్క ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధరల పెరుగుదల, అగ్నిపథ్‌, నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు వంటి అంశాలపై ఈ ఆందోళన నిర్వహించింది. దిల్లీలో జరిగిన నిరసనల్లో ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌, ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో పర్యటించాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా దానిని వాయిదా వేసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా 16 వేల కేసులు...

దేశవ్యాప్తంగా నిన్న 3.25 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,047 మందికి వైరస్ సోకింది. 54 మంది మరణించారు. 19,539 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదైంది. క్రియాశీల కేసులు 1.28 లక్షలకు చేరాయి. దేశంలో కొత్త కేసుల సంఖ్య అదుపులోనే ఉన్నప్పటికీ.. దిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా రెండువేలకు పైగానే వెలుగుచూస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. ఇక దేశం మొత్తం మీద 207 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 15 లక్షల మంది టీకా తీసుకున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని