Nirmala Sitharaman: ద్రవ్యోల్బణంపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు లేదు

దేశంలో ద్రవ్యోల్బణంపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు మాత్రం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.

Published : 10 May 2023 14:33 IST

బెంగళూరు: దేశంలో ధరల పెరుగుదల నియంత్రణకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) తీరును ప్రస్తావించిన ఆమె.. ధరల పెరుగుదలపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) భాగంగా బెంగళూరులో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో స్పష్టమైన మెజార్టీతో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తోన్న నిర్మలా సీతారామన్‌.. జయనగర్‌ అసెంబ్లీ సెగ్మెంటులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం 2014 నుంచి చర్యలు తీసుకుంటోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి బొమ్మై కూడా పెట్రోల్‌పై రెండుసార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించారు. ద్రవ్యోల్బణం విషయానికొస్తే నేను ప్రజలతోనే ఉంటాను. అవి మరింత తగ్గాల్సి ఉంది. కానీ, ఈ అంశంపై విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు మాత్రం లేదు. వాళ్లు ఒకసారి గత యూపీఏ ప్రభుత్వాన్ని గుర్తుచేసుకోవాలి’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నప్పటికీ.. ఎన్ని స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

మనీ పవర్‌తో గెలవాలని..

అభివృద్ధిపై చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ధనబలంతో భాజపా తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని భాజపా కొనసాగిస్తోందన్న ఆయన.. అంతకంటే చేయడానికి వారి చేతుల్లో ఏమీ లేదని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో భాజపా చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి వంటి విషయాలపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభావం ఏమీ లేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని