Congress: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం..మోదీ ప్రభుత్వానికి సోదరులు: కాంగ్రెస్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండు సోదరుల్లాంటివని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది....

Updated : 04 Sep 2022 14:00 IST

 

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండు సోదరుల్లాంటివని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ధరల పెరుగుదల, అత్యవసర సరకులపై జీఎస్టీ పెంపు, నిరుద్యోగం అంశాలపై ఆదివారం దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. దానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించడం లేదని జైరాం అన్నారు. ప్రభుత్వం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపు 13 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరుకానున్నారని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ ప్రభుత్వానికి సందేశం ఇవ్వనున్నామని తెలిపారు.

జమ్మూలో గులాం నబీ ఆజాద్‌ ర్యాలీ గురించి ప్రస్తావించగా.. తాను కాంగ్రెస్‌ ర్యాలీ గురించి మాత్రమే మాట్లాడతానని.. భాజపా ర్యాలీ గురించి కాదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆజాద్‌ను భాజపా మద్దతుదారుగా అభివర్ణించారు. అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్‌ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందన్న భాజపా ఆరోపణలపై జైరాం స్పందించారు. తాము ఈ ఆందోళనలను దాదాపు ఏడాది నుంచి నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఆగస్టు 5న జైపుర్‌లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించామన్నారు. దాదాపు 70 మంది ఎంపీలను విజయ్‌చౌక్‌ నుంచి అరెస్టు చేశారని తెలిపారు. పార్లమెంటు బయట, వెలుపల నిరసన వ్యక్తం చేశామన్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఆందోళనలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో సెప్టెంబరు 7 నుంచి ‘భారత్‌ జోడో యాత్ర’ను నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తరహాలోనే ఈడీ, సీబీఐ కూడా మోదీ ప్రభుత్వానికి రెండు సోదరుల్లాంటివని ఆరోపించారు.

నేటి ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఇతర పార్టీ సీనియర్‌ నేతలు ప్రసంగించనున్నారు. దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇందులో పాల్గొననున్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు పడుతున్న కష్టాలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా తాము వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నామని కాంగ్రెస్‌ తెలిపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు