Chidambaram: కాంగ్రెస్‌ నేత...టీఎంసీ తరఫున కోర్టులో వాదించారు..

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ప్రముఖ న్యాయవాది

Published : 05 May 2022 01:38 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ప్రముఖ న్యాయవాది అయిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ కేసులో వాదనలు వినిపించారు. కానీ ఆయన వాదించింది హస్తం పార్టీకి వ్యతిరేకంగా కావడంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. కోర్టు బయట చిదంబరానికి వ్యతిరేకంగా కొందరు న్యాయవాదులు ఆందోళన కూడా చేపట్టారు.

బెంగాల్‌లోని మెట్రో డైరీ సంస్థలోని కొన్ని వాటాలను తృణమూల్‌ ప్రభుత్వం ప్రైవేటు అగ్రో ప్రాసెసింగ్ కంఎపీ కేవెంటర్‌కు విక్రయించింది. అయితే ఈ విక్రయాన్ని సవాల్‌ చేస్తూ బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ చౌధరీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో చిదంబరం కేవెంటర్‌కు మద్దతుగా తృణమూల్‌ తరఫున వాదనలు వినిపించేందుకు నేడు కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న కొందరు న్యాయవాదులు కోర్టు బయట చిదంబరానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, కీలక నేత అయిన చిదంబరం.. హస్తం పార్టీ వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఎలా వాదిస్తారు?’’ అంటూ కొందరు న్యాయవాదులు ప్రశ్నించారు. అయితే ఈ ఘటనపై అధిర్‌ రంజన్‌ చౌధరీ కూడా స్పందించారు. ‘‘వృత్తిపరంగా ఆయనో న్యాయవాది. ఏ కేసుకు వాదించాలో వద్దో అనే నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకు ఉంది’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని