Rahul Gandhi: ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఇబ్బంది పడ్డ రాహుల్ గాంధీ.. వీడియో వైరల్‌

కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేపడుతోన్న బ్రిటన్ పర్యటన తాజాగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది.

Published : 27 May 2022 02:04 IST

దిల్లీ: కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేస్తున్న బ్రిటన్ పర్యటన తాజాగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది. భారతీయ సమాజంలో హింస, అహింస అనే అంశంపై ప్రశ్న ఎదురుకాగా.. సమాధానం చెప్పేందుకు రాహుల్ తడుముకొన్నట్లు కనిపించింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎదురైన ప్రశ్నపై స్పందించే ముందు రాహుల్ కొంత సమయం తీసుకున్నారు. ‘ఈ విషయంలో మొదట నాకు గుర్తొచ్చే పదం క్షమాపణ. ఇది కచ్చితమైందేమీ కాదు’ అంటూ సమాధానమిచ్చి మళ్లీ ఆగిపోయారు. దాంతో నిశ్శబ్దాన్ని చేధించేందుకు అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ‘దీనిపై సమాధానం చెప్పేందుకు నేను ఆలోచిస్తున్నాను’ అంటూ వారిని ఉద్దేశించి రాహుల్ అన్నారు. దాంతో ఆ పరిస్థితిని తేలిక పరిచేందుకు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి..‘మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయడం నా ఉద్దేశం కాదు. ఇంతకుముందు మిమ్మల్ని ఈ ప్రశ్న ఎవరు అడిగి ఉండకపోవచ్చు’ అంటూ క్షమాపణ తెలియజేశారు. ‘అలా ఏం లేదు. మీరు నన్నేం ఇబ్బంది పెట్టలేదు. దీనిపై లోతుగా సమాధానం ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను’ అంటూ కాంగ్రెస్ నేత వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరూ చిరునవ్వు చిందించారు. 

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై భాజపా తన విమర్శలకు పదును పెట్టింది. ముందుగా రాసిపెట్టుకున్న అంశాలపై మాట్లాడంటూ భాజపా నేత అమిత్‌ మాలవీయ ఈ వీడియోను ట్వీట్ చేశారు. కాగా, దీనిపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌కు మద్దతుగా నిల్చారు. ‘ఉగ్రవాదుల దాడుల్లో నానమ్మ, తండ్రిని కోల్పోయిన బాధను భాజపా మిత్రులు అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఆయనకు ఎదురైన ప్రశ్నను క్షమాపణ అనే ఒకే ఒక్క పదంతో వివరించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అహింస అనే గాంధీ సిద్ధాంతాన్ని తక్కువ చేయొద్దు’ అంటూ రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు