Karnataka: కోలార్‌ నుంచీ పోటీ చేస్తా: సిద్ధరామయ్య ప్రకటన

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి వెల్లడించారు. తొలుత కోలార్‌ నుంచి పోటీ చేయాలని ఆయన అనుకున్నా.. రాహుల్‌ గాంధీ సూచన మేరకు వరుణ నుంచి ఆయన బరిలోకి దిగారు.

Published : 30 Mar 2023 01:52 IST

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. గత కొన్నిరోజులుగా ముమ్మర ప్రచారంతో ముందుకెళ్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు.. గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. చామరాజనగర్‌ జిల్లా వరుణ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అధిష్ఠానం అనుమతిస్తే.. కోలార్‌ నుంచి కూడా బరిలోకి దిగుతానన్నారు.

‘‘2018లో జరిగిన ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి గెలుస్తానని నమ్మకం లేకపోవడంతో బాదామిలోనూ పోటీ చేశాను. ఈ సారి మాత్రం వరుణ నియోజకవర్గం నుంచి కచ్చితంగా విజయం సాధిస్తానని విశ్వాసంతో ఉన్నా.. అయితే కోలార్‌ ప్రజలు నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు నన్ను కోరారు. అందువల్ల కోలార్‌ నుంచి  పోటీ చేసేందుకు అవకాశం కల్పించి టికెట్‌ను ఇవ్వాలని హైకమాండ్‌ను కోరుతున్నా’అని మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

ఇవే.. నాకు చివరి అసెంబ్లీ ఎన్నికలు..!


రాష్ట్రంలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలు అని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. దీని తర్వాత తాను మళ్లీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని తెలిపారు.  ‘వరుణ నియోజకవర్గంలోనే  నా రాజకీయ జీవితాన్ని ముగించాలన్నది నా ఆశ. ఇవే నా చివరి ఎన్నికలు కాబట్టి అన్నీ ఆలోచించి ఇక్కడి నుంచి  పోటీ చేస్తున్నాను. నేను వరుణ పుత్రుడిని.. ప్రజలు తమ అభిమానంతో నన్ను తప్పకుండా గెలిపిస్తారు’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.  మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India)  బుధవారం  ప్రకటించింది.  రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాషాయ పార్టీ రెండోసారి అధికారం చేజిక్కించుకునేందుకు యత్నిస్తుండగా..  కనీసం 150 సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు