Congress: కేంద్రంపై రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ఫిర్యాదు.. ర్యాలీగా వెళ్లిన సీనియర్‌ నేతలు

కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కలిసి కేంద్రంపై ఫిర్యాదు చేశారు.........

Published : 20 Jun 2022 23:55 IST

దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతి (President) రామ్​నాథ్ కోవింద్​ను ( Ram Nath Kovind) కలిసి కేంద్రంపై ఫిర్యాదు చేశారు. తమ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్ల కేంద్రం అనుచిత ప్రవర్తన పట్ల తాము శాంతీయుతంగా నిరసన తెలుపుతుంటే.. కేంద్రం తమపైకి పోలీసులను ఉసిగొల్పిందంటూ రాష్ట్రపతికి తెలిపారు. పోలీసులు తమపై దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈడీ (ED) విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. అగ్నిపథ్ (Agnipath) వల్ల యువతకు, దేశ భద్రతకు నష్టంవాటిల్లుతుందంటూ దీనిపైనా  ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతోపాటు సీనియర్‌ నేతలు చిదంబరం, జైరాం రమేశ్, అధీర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్ తదితరులు రాష్ట్రపతిని కలిసి కేంద్రంపై ఫిర్యాదు చేశారు.

అగ్నిపథ్ పథకం గురించి ఏ కమిటీతోనూ ప్రభుత్వం చర్చించలేదని, పార్లమెంట్​లోనూ బిల్లు ప్రవేశపెట్టలేదని రాష్ట్రపతితో చెప్పినట్లు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వెల్లడించారు. ప్రజాస్వామ్య హక్కులకు ఇది విఘాతం కలిగిస్తుందని తెలియజేశామన్నారు. రాష్ట్రపతికి సమర్పించిన రెండో మెమొరాండంలో కాంగ్రెస్ నేతలపై పోలీసుల దౌర్జన్యాల గురించి ప్రస్తావించినట్లు చిదంబరం (Chidambaram) పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ‘ఈ సమస్యను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వద్దకు పంపించేలా చూడాలని రాష్ట్రపతిని అభ్యర్థించాం. మావైపు వాదనలు వినిపిస్తాం. దిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ వారి వాదనలు వినిపిస్తాయి. దీనిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమస్యపై దృష్టిసారిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు’ అని చిదంబరం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని