Rahul Gandhi: రాహుల్‌పై చర్యల్ని చూస్తూ ఊరుకోం: కాంగ్రెస్‌

రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై చర్యలను చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అన్నారు. 

Published : 24 Mar 2023 17:34 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గముంటున్నాయి. పలు చోట్ల కార్యకర్తలు ఆందోళనకు దిగగా.. ఈ అంశాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని ఆ పార్టీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అభిషేక్‌మను సింఘ్వీ, జైరాం రమేశ్ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ భయం లేకుండా మాట్లాడతారని అందరికీ తెలిసిందే.. పార్లమెంట్‌ బయట, వెలుపలా ఆయన నిర్భయంగా గళం వినిపిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. రాహుల్‌పై చర్యలను చూస్తూ ఊరుకోబోమన్నారు. నిర్భయంగా మాట్లాడే స్వభావం కలిగిన రాహుల్‌ గొంతును నొక్కేందుకు భాజపా నేతలు కొత్త టెక్నిక్స్‌ వెతుకుతున్నారంటూ మండిపడ్డారు.  ఈ కేసులో తమకు స్టే వస్తుందన్న విశ్వాసం ఉందన్న ఆయన.. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. అతి త్వరలోనే విజయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తంచేశారు. 

రాహుల్‌ యాత్రను చూసి భాజపా భయపడింది: జైరాం

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్‌ మరో సీనియర్‌ నేత జైరాం రమేశ్ అన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీకి బదులు రాహుల్‌పై అనర్హత వేటు వేశారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర చూసి భాజపా భయపడిందన్న ఆయన.. ఆ యాత్రతో ప్రజల్లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. రాహుల్‌ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి భాజపా నేతలు తట్టుకోలేకపోయారనీ.. అందుకే భారత్‌ జోడో యాత్ర చేపట్టిన మొదట్నుంచీ నిందలు వేస్తూనే ఉన్నారన్నారు. అదానీ వ్యవహారంపై 16 పార్టీలు జేపీసీ దర్యాప్తు కోరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాహుల్‌పై అనర్హత వేటును ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని జైరాం రమేశ్‌ స్పష్టంచేశారు.

సాయంత్రం 6గంటలకు కీలక భేటీ!

మరోవైపు, రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఈ సాయంత్రం 6గంటలకు కాంగ్రెస్‌ కీలక నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగే ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకతో పాటు పలువురు అగ్రనేతలు పాల్గొననున్నట్టు సమాచారం. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని