Om Birla: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాసతీర్మానం!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు లోక్‌సభ (LokSabha) స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla)పై ఆ పార్టీ అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Published : 29 Mar 2023 00:52 IST

దిల్లీ: లోక్‌సభ (LokSabha) స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla)పై కాంగ్రెస్‌ (Congress) పార్టీ అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం విపక్ష పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే సోమవారం కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.  సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరనుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు విషయంలో స్పీకర్‌ కార్యాలయం తొందరపాటుగా వ్యవహరించిందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఏప్రిల్‌ 6న  పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోపు  ప్రాంతీయ పార్టీలతో కలిసి స్పీకర్‌పై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచన చేస్తోంది. 

ప్రధాని మోదీ (PM Modi) ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఈ నెల  23న  రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ విషయమై  అప్పీల్ చేసేందుకు  సూరత్ కోర్టు  సమయం ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన మరుసటిరోజే మార్చి 24వ  తేదీన లోక్‌సభ సెక్రటేరియట్‌ (LokSabha Secretariat) రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ  నోటిఫికేషన్ వెలువరించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.  ఈ చర్యకు తప్పుపడుతూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు భాజపాయేతర పార్టీలు మద్దతు ప్రకటించాయి.  సోమవారం కాంగ్రెస్‌ చేపట్టిన నల్ల దుస్తుల నిరసన కార్యక్రమంలో తృణమూల్‌, భారాస, డీఎంకే వంటి ప్రధాన ప్రాంతీయపార్టీలు పాల్గొన్నాయి. అనంతరం రాహుల్ గాంధీ అనర్హత వేటు, అదానీ అంశంపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్ నేపథ్యంలో లోక్‌సభలో అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ప్రతి పార్టీల నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీకి తృణమూల్‌, ఎన్‌సీపీ, డీఎంకే, భారాస, వామపక్ష పార్టీలు సహా ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని