Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..

చీతాలను మన దేశానికి తీసుకురావడంలో పెద్ద కుట్రే ఉందంటున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. దీనివల్ల పార్టీ ఓట్లకు గండిపడుతుందంటూ సెలవిచ్చారు.

Published : 08 Feb 2023 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో ఎప్పుడో అంతరించిపోయిన చీతాలు (Cheetah).. దాదాపు 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి అడుగుపెట్టాయి. నమీబియా నుంచి 8 చీతాలను గతేడాది ప్రత్యేక విమానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో (Kuno National park) వాటిని విడిచిపెట్టారు. మరిన్ని చీతాలను తెప్పించేందుకు సైతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చీతాలు రప్పించడం వెనుక రాజకీయ కుట్రే దాగి ఉందంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే ఓ వింత వాదనను తెరపైకి తెచ్చారు. ఇంతకీ ఆ సంగతేంటో చూద్దాం రండి..

మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా కరేరా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆయన. పేరు ప్రగిలాల్‌ జాతవ్‌. ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ రాకను పురస్కరించుకుని సన్నాహక సమావేశం అది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, అణగారిన వర్గాలకు చెందిన పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. చీతాలను రప్పించేందుకు భారతీయ జనతా పార్టీ రూ.117 కోట్లు వెచ్చించిందని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సరిగ్గా ఇక్కడే ఆయన తన ‘విజ్ఞానాన్ని’ ప్రదర్శించారు.

‘‘కునో నేషనల్‌ పార్క్‌కు చీతాలు తీసుకురావడం వెనుక పెద్ద ప్లానే ఉంది. ప్రస్తుతానికి అవి చిన్నవి. అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి’’ అంటూ తనకు తోచింది చెప్పుకొంటూ పోయారు. భాజపా జంతువులకు ప్రాతినిధ్యం వహిస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈయన గారికి స్పీచ్‌కు అక్కడున్న వారు చప్పట్లు కొట్టడం ఒక ఎత్తైయితే.. అందుకు ఆయన నవ్వులు చిందించడం మరో ఎత్తు. అలాగే కమల్‌నాథ్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంచి దుస్తులు ధరించి రావాలని అక్కడి ప్రజలకు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు