Congress MP: తండ్రి చనిపోయిన 2 రోజులకే.. ఎంపీ ఆకస్మిక మృతి

మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ ధానోర్కర్‌ (Suresh Balu Dhanorkar) ఆకస్మికంగా మృతిచెందారు. రెండు రోజుల క్రితమే ఆయన తండ్రి కూడా మరణించారు.

Published : 30 May 2023 12:01 IST

దిల్లీ/ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన కాంగ్రెస్‌ (Congress) ఎంపీ సురేశ్‌ బాలు ధానోర్కర్‌ (Suresh Balu Dhanorkar) (47) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా.. రెండు రోజుల క్రితమే ఎంపీ తండ్రి అనారోగ్యంతో మరణించారు. గంటల వ్యవధిలోనే ఆయన కూడా మరణించడం సురేశ్ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.

కిడ్నీలో రాళ్లకు చికిత్స తీసుకునేందుకు మే 26న సురేశ్‌ ధానోర్కర్‌ (Suresh Balu Dhanorkar) నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత ఆదివారం ఆయన్ను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారని కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ థోరట్‌ తెలిపారు. కాగా.. సురేశ్ నాగ్‌పూర్‌ ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఆయన తండ్రి నారాయణ్‌ ధానోర్కర్‌ (80) అనారోగ్య కారణాలతో గత శనివారం మరణించారు. తండ్రి అంత్యక్రియలకు కూడా ఎంపీ హాజరుకాలేకపోయారు. సురేశ్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్‌ (Congress) నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర నుంచి లోక్‌సభ (Lok Sabha)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ ధానోర్కరే. బాలాసాహెబ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ కెరీర్‌ను ప్రారంభించిన సురేశ్‌.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సురేశ్ భార్య ప్రతిభ.. 2019లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వరోరా-భద్రావతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు