Congress MLAs: నగదుతో పట్టుబడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు.. పార్టీ నుంచి సస్పెన్షన్‌

భారీ నగదుతో పోలీసులకు పట్టుబడిన ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై (Congress MLAs) వేటు పడింది.

Published : 01 Aug 2022 01:38 IST

ఝార్ఖండ్‌లో ఎమ్మెల్యేల వ్యవహారంపై సోనియా గాంధీ సీరియస్‌

రాంచీ: భారీ నగదుతో పోలీసులకు పట్టుబడిన ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై (Congress MLAs) వేటు పడింది. ఆ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. తమ వాహనంలో భారీ నగదుతో వెళ్తోన్న ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిలు పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) రాణిహటి వద్ద పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోలీసులకు పట్టుబడడం జేఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని భాజపా ఆరోపించింది.

‘ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. వీరి సస్పెన్షన్‌ వెంటనే అమల్లోకి వస్తుంది’ అని ఝార్ఖండ్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ అవినాశ్‌ పాండే వెల్లడించారు. ఇందుకు సంబంధించి పార్టీలో ప్రతిఒక్కరి సమాచారం తమ దగ్గర ఉందన్న ఆయన.. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదిలాఉంటే, ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని భాజపా డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో జేఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అవినీతికి ఇది నిదర్శనమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌లో అవినీతిపై దర్యాప్తు జరపాలని బెంగాల్‌ భాజపా సీనియర్‌ నేత దిలీప్‌ ఘోష్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బేరసారాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలోనే ఈ నగదు లభ్యమైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని