Sharad Pawar: లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది.. వారి చేతుల్లోనే: శరద్‌ పవార్‌

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది కాంగ్రెస్ నిర్ణయిస్తుందని ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్‌ పవార్‌ తెలిపారు. ‘ఇండియా’ కూటమిలో ఆ పార్టీకే ఎక్కువ సీట్లు ఉన్నాయన్నారు.

Published : 20 Jun 2024 17:40 IST

పుణె: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. జూన్‌ 24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో స్పీకర్ పదవి ఎవరికి దక్కొచ్చనే అంశం ఉత్కంఠగా మారింది. మరోవైపు లోక్‌సభ (Lok Sabha)లో ప్రతిపక్ష నేత (LoP)గా విపక్ష ‘ఇండియా’ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందనేదానిపైనా ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ విషయాన్ని కాంగ్రెస్ నిర్ణయిస్తుందని ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్‌ పవార్‌ తెలిపారు. తమ కూటమిలో ఆ పార్టీకే ఎక్కువ సీట్లు ఉన్నాయని గుర్తుచేశారు.

‘‘కూటమిలో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీకి చెందిన నేతకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా దక్కేలా గతంలో మా మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం 99 సీట్లతో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు ఆ హోదాలో ఉంటారనేది ఆ పార్టీనే నిర్ణయిస్తుంది. అనంతరం కూటమి సభ్యుల ఆమోదం అవసరం’’ అని పుణెలో మీడియాతో మాట్లాడుతూ శరద్‌ పవార్‌ చెప్పారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఇటీవల ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

65% రిజర్వేషన్లు రద్దు.. పట్నా హైకోర్టు సంచలన తీర్పు

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా ఎవరైనా ప్రతిపక్ష నేత ఉండేలా ప్రయత్నాలు చేస్తారా? అనే ప్రశ్నకు శరద్‌ పవార్‌ స్పందిస్తూ.. గత రెండు ప్రభుత్వాల్లో ప్రధాని మోదీ ఈ నియమాన్ని పాటించలేదన్నారు. ఈ అంశంపై చర్చ జరిగినా.. సానుకూల ఫలితం వస్తుందని భావించడం లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) మెరుగైన ఫలితాలు సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ఆయన హామీ నకిలీదని తేలిందన్నారు. రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ 30 చోట్ల గెలుపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని