Rahul Gandhi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన... పలుచోట్ల ఉద్రిక్తత

Congress workers protest: రాహుల్‌పై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. పలు చోట్ల ఆ పార్టీ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

Updated : 25 Mar 2023 19:46 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) సూరత్‌ కోర్టు రెండేళ్ల జైటు శిక్ష విధించడం, ఆపై ఆయనపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్‌ శ్రేణులు (Congress) భగ్గుమన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆ పార్టీ కార్యకర్తలు శనివారం నిరసనలు ప్రదర్శనలకు దిగారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల శాంతియుతంగా ఈ నిరసనలు జరగ్గా.. మరికొన్ని చోట్ల కాస్త ఉద్రిక్తతకు దారితీశాయి. పలు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ దిష్టి బొమ్మలను పార్టీ కార్యకర్తలు దహనం చేశారు.

దేశ రాజధాని దిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు రాహుల్‌ గాంధీ మాస్క్‌లను ముఖానికి ధరించి ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ‘భయంలేదు’, ‘నిజమైన గాంధీ సత్యం కోసం పోరాడుతూనే ఉంటాడు’ అని రాసి ఉన్న ప్లకార్డులతో తమ నిరసన తెలిపారు. చండీగఢ్‌లో దిల్లీకి వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలును స్థానిక యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుకున్నారు.

రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. వయనాడ్‌లో ఆ పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడి కూటమి సభ్యులంతా అసెంబ్లీ ఎదుట తమ నోటికి నల్ల వస్త్రాన్ని కట్టుకుని... ‘ప్రజాస్వామ్యానికి మరణం’ అని రాసి ఉన్న ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. ఆదిత్య ఠాక్రే సైతం నిరసనలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సైతం నిరసన ప్రదర్శనలు జరిగాయి. కొందరు పార్టీ నాయకులు తమ నోటికి తాళాలు వేసుకుని శాంతియుతంగా నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ, ఝార్ఖండ్‌లలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని