Jacqueline Fernandez: అమిత్‌ షా పేరు చెప్పి జాక్వెలిన్‌తో పరిచయం.. జయలలిత బంధువుగా స్నేహం!

మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌తో పరిచయంపై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అమిత్ షా ఆఫీస్‌ పేరు చెప్పి

Updated : 14 Dec 2021 15:26 IST

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌తో పరిచయంపై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అమిత్ షా ఆఫీస్‌ పేరు చెప్పి సుకేశ్‌.. నటితో స్నేహం పెంచుకున్నాడని తెలిసింది. అంతేగాక, తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బంధువునని కూడా చెప్పాడట. ఇక జాక్వెలిన్‌కు ఖరీదైన గిఫ్ట్‌లు కూడా ఇచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఈ ఏడాదిలో రెండు సార్లు ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన దర్యాప్తు సంస్థ.. ఆ వివరాలను ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇటీవల ఈ ఛార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. అందులోని వివరాల ప్రకారం.. సుకేశ్ తనను తాను ‘శేఖర రత్నవేలు’గా జాక్వెలిన్‌ను పరిచయం చేసుకున్నాడు.

‘‘2020 డిసెంబరు, 2021 జనవరిలో చాలా వారాల పాటు అతడు(సుకేశ్)‌.. ఆమె(జాక్వెలిన్‌)తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కాల్స్‌కు ఆమె స్పందించలేదు. ఆ తర్వాత ఒకరోజు నటి మేకప్‌ ఆర్టిస్ట్‌ షాన్‌ ముథాతిల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్‌ నుంచి వచ్చినట్లు తలపించేలా ఆ కాల్‌ వచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ అలియాస్‌ శేఖర ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని, ఆయనతో నటి మాట్లాడాలన్నది ఆ కాల్‌ సారాంశం. దీంతో సుకేశ్‌ నంబరును మేకప్‌ ఆర్టిస్ట్‌.. జాక్వెలిన్‌కు ఇవ్వగా.. ఆమె అతడిని సంప్రదించింది. ఆ సమయంలో సుకేశ్‌ తనను తాను శేఖర రత్నవేలు అని, సన్‌ టీవీ ఓనర్‌గా పరిచయం చేసుకున్నాడు. అంతేగాక, తాను జయలలిత రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తినని, చెన్నై నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీకు(జాక్వెలిన్‌) పెద్ద అభిమానినని, దక్షిణాది చిత్రాల్లో నటించాలని కోరాడు. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది’’ అని ఈడీ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. 

ఆ కాల్‌ గురించి దర్యాప్తు చేయగా.. అది నకిలీ కాల్‌ అని తేలినట్లు ఈడీ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు సుకేశ్‌.. జాక్వెలిన్‌తో నిరంతరం టచ్‌లోనే ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఇక, సుకేశ్‌ నుంచి కోట్లాది రూపాయాల ఖరీదైన కానుకలు తీసుకున్నట్లు నటి.. ఈడీ విచారణ సమయంలో చెప్పినట్లు తెలిసింది. ఇందులో వజ్రాల చెవిపోగులు, బ్రాసెలైట్‌, డిజైనర్‌ బ్యాగ్‌లు వంటివి కూడా ఉన్నాయట.

కాలర్‌ ఐడీ స్పూఫింగ్‌తో హైటెక్‌ మోసం..

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 17ఏళ్ల వయసులోనే నేరాల్లోకి అడుగుపెట్టిన సుకేశ్‌.. ప్రముఖులు, సంపన్నులను మోసం చేయడమే లక్ష్యంగా నేరాలు చేస్తూ వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఫోన్‌ స్పూఫింగ్‌ టెక్నాలజీతో ప్రముఖులకు అతడు ఫోన్‌ చేసేవాడు. అతడు కాల్‌ చేసినప్పుడు.. అవతలి వ్యక్తి ఫోన్‌పై కాలర్‌ ఐడీలో ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్‌ వస్తున్నట్లు కన్పించేది. దీంతో వారు నమ్మి మోసపోయేవారని ఈడీ పేర్కొంది. జైల్లో నుంచి కూడా సుకేశ్‌ ఈ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని