Sukesh Chandrashekhar: సత్యేంద్ర జైన్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయి..!

ఆర్థిక నేరగాడు, రూ.200కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ మరోసారి ఆప్‌ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వారి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఎల్‌జీకి లేఖ రాశాడు.

Published : 07 Nov 2022 12:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఓ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్‌, జైళ్ల శాఖ డీజీపీ సందీప్‌ గోయల్‌ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించాడు. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనాకు లేఖ రాశాడు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరాడు. ఆ దర్యాప్తు పూర్తయితే ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, సత్యేంద్ర జైన్‌ల అసలు రూపం తెలుస్తుందని పేర్కొన్నాడు. ఒక వేళ దర్యాప్తు మొదలుపెడితే తాను వారితో భేటీ అయిన విషయాలు, క్యాష్‌ను ఎన్నిసార్లు అందజేసింది, ఎక్కడెక్కడ ఇచ్చింది వంటి సమాచారం కూడా ఇస్తానని తెలిపాడు.

గతంలో తాను చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయడంతో జైలు అధికారుల నుంచి తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సుకేశ్‌ వెల్లడించాడు. ఆప్‌పార్టీ కార్యకర్తల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని ఆరోపించాడు. ‘‘సర్‌.. వారికి బెదిరిపోయి ఈ అభ్యర్థన చేయడం లేదు. నాపై ఒత్తిడి తీవ్రంగా పెరిగి పోయింది. ఆప్‌ గురించి సమాచారం బయటపెట్టకముందే ఏదైనా అనుకోని ఘటన చోటు చేసుకోవచ్చు. ఈ వ్యహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించండి’’ అని తన లేఖలో సుకేశ్‌ కోరాడు. ఈ మేరకు ఓ లేఖను తన న్యాయవాది అశోక్‌ సింగ్‌ ద్వారా పోస్టు చేశాడు.  జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్‌ తన నుంచి బలవంతంగా రూ.10కోట్లు వసూలు చేశారని ఇటీవల ఆరోపించాడు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి జైన్‌ తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు