LS Speaker: ఎన్నిక ఎరుగని ‘స్పీకర్‌’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది.

Published : 18 Jun 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజా సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha) లోక్‌సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు.. స్పీకర్‌ ఎన్నికపై కన్నేశాయి. తమకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వకుంటే.. స్పీకర్‌ ఎన్నిక నిర్వహించాలనే డిమాండును తెరమీదకు తెస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక సంప్రదాయానికి తెర పడుతుందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ అదే జరిగితే.. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్‌ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్లవుతుంది.

స్వాతంత్ర్యానికి ముందు పార్లమెంటును సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీగా పేర్కొనేవారు. ఈ క్రమంలో 1925-1945 మధ్య కాలంలో ఆరుసార్లు స్పీకర్ల ఎన్నిక జరిగింది. విఠల్‌భాయ్‌ జే పటేల్‌ (రెండుసార్లు), మహమ్మద్‌ యాకూబ్‌, ఇబ్రహీం రహ్మతొల్లా, శణ్ముఖం శెట్టి, సర్‌ అబ్దుల్‌ రహీమ్‌, జీవీ మావలంకర్‌ ఈ జాబితాలో ఉన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్‌, తాత్కాలిక పార్లమెంటు స్పీకర్‌గా జీవీ మావలంకర్‌ కొనసాగారు.

స్వాతంత్ర్యానంతరం..

1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మావలంకర్‌ మరణంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయ్యంగార్‌.. స్పీకర్‌ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా నియమితులయ్యారు. అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎంఏ అయ్యంగార్‌, జీఎస్‌ ధిల్లాన్‌, బలరాం జాఖడ్‌, జీఎంసీ బాలయోగి మాత్రమే రెండుసార్లు స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. అయితే, తాజా ఎన్నికలో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ‘ఇండియా’ కూటమి.. డిప్యూటీ స్పీకర్‌ పదవి కావాలని డిమాండు చేస్తోంది. అదేవిధంగా స్పీకర్‌ పదవిని తీసుకోవాలంటూ.. సంకీర్ణ ప్రభుత్వంలోని భాజపా మిత్రపక్షాలకు సూచిస్తోంది. ఇందుకు మద్దతు కూడా ఇస్తామని ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతను ఉప సభాపతిగా అంగీకరించకుంటే స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని