
CBSE 12: ఇంటి వద్దే పరీక్ష పెట్టండి
కోరుతున్న విద్యార్థి సంఘాలు
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలు పెట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఓపెన్‌బుక్, ఇంటి వద్ద నుంచే పరీక్ష రాయడం వంటి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాయి.
‘‘ ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలను విద్యార్థులకు పంపించి.. నిర్ణీత సమయంలో పరీక్ష రాయాలని చెప్పాలి. తిరిగి ఆ జవాబు పత్రాలను పరీక్షా కేంద్రంలో సమర్పించమని అడగాలి. ఆన్లైన్ లేదా పోస్టు ద్వారా విద్యార్థులు తమ జవాబు పత్రాలను పంపించే అవకాశం కల్పించాలి’’ అని కొన్ని విద్యార్థి సంఘాలు కేంద్ర విద్యాశాఖ మంత్రిని లేఖ ద్వారా కోరాయి. అటు అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా దీనిపై కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు లేఖ రాసింది. ఓపెన్ బుక్ పద్ధతిలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని కోరింది.
మరోవైపు 12వ తరగతి పరీక్షలు, ఇతర వృత్తివిద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలు అభిప్రాయాలు పంపించేందుకు గడువు నేటితో ముగిసింది. దీనిపై జూన్ 1న కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. అన్ని సబ్జెక్టులకు కాకుండా కేవలం ప్రధానమైన కొన్నింటికే పరీక్షలు నిర్వహించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 12వ తరగతి పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో ఇంటి వద్ద నుంచే రాసుకునేందుకు విద్యార్థులకు వీలు కల్పించింది.
ఇవీ చదవండి
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.