కాస్త కదిలిన రాకాసి ఓడ

ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో చిక్కుకుని అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న భారీ కంటైనర్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ కాస్త కదిలింది. ఇది పాక్షికంగా నీటిపై తేలియాడుతున్నట్లు

Published : 29 Mar 2021 10:42 IST

సూయిజ్‌: ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో చిక్కుకుని అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న భారీ కంటైనర్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ కాస్త కదిలింది. ఇది పాక్షికంగా నీటిపై తేలియాడుతున్నట్లు మారిటైమ్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ ఇంచ్‌కేప్‌ వెల్లడించింది. 20వేల కంటైనర్లతో వెళ్తున్న ఎవర్‌ గివెన్‌ నౌక గత మంగళవారం సూయిజ్‌ కాలువలో అడ్డంగా తిరిగి చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో నౌక ఒక భాగం భూమిలో కొంతమేర కూరుకుపోయింది. దీంతో ఓడను తిరిగి నీటిపై తేలియాడేలా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగాయి.

ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లు తవ్వుతుండగా.. టగ్‌బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేశాయి. అలా ఓడ కిందన ఇసుకను తవ్వి నీటిని పంప్‌ చేశారు. దీంతో సోమవారం తెల్లవారుజాము నాటికి ఎవర్‌ గివెన్‌ మళ్లీ నీటిపై తేలియాడుతున్నట్లు ఇంచ్‌కేప్‌ తెలిపింది. ఇందుకోసం 18 మీటర్ల లోతులో దాదాపు 27వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తొలగించారు. అయితే ప్రస్తుతం ఈ నౌక సూయిజ్‌ కాలువలో అడ్డంగానే ఉంది. దీన్ని నిలువగా కదిలించిన తర్వాతే కాలువలో రాకపోకలకు మార్గం సుగమమవుతుంది. కానీ, దీనికి ఇంకెంత సమయం పడుతున్నది స్పష్టంగా తెలియరావట్లేదు. అయితే ఓడ నీటిపైకి రావడంతో అతి త్వరలోనే దీన్ని కాలువ నుంచి బయటకు తీసుకురావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

నిలిచిన 450 నౌకలు

అంతర్జాతీయ వాణిజ్యానికి సూయిజ్‌ జలమార్గం కీలకమైనది. ప్రపంచ వాణిజ్యంలో పది శాతం ఈ కాలువ మీదుగానే జరుగుతుంది. అలాంటి కాలువలో మంగళవారం నుంచి నౌక చిక్కుకుపోవడంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించాయి. సోమవారం ఉదయం నాటికి ఈ కాలువ మీదుగా వెళ్లేందుకు దాదాపు 450 నౌకలు వేచి చూస్తున్నాయి. మరోవైపు ఘటన నేపథ్యంలో గత ఆరు రోజులుగా జల రవాణా నిలిచిపోవడంతో రోజుకు 9 బిలియన్‌ డాలర్ల వ్యాపారం స్తంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని