
Tamilnadu: చెన్నైలో కేసుల పెరుగుదల: తిరిగి కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు
చెన్నై: చెన్నైలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈనేపథ్యంలో చెన్నైలో తిరిగి కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. నేడు జోన్లలో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మాసుబ్రమణియన్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ పరిశీలించారు. చెన్నైలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని, కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అందుకే తిరిగి కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 39,537 వీధుల్లో 507 వీధుల్లో కరోనా వ్యాప్తి ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఈకారణంగా ఒకే వీధిలో ముగ్గురికి పైబడి కరోనా సోకినట్లయితే ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నామన్నారు.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా వైద్య సదుపాయాలు మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు, ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. తమిళనాడులో 86శాతం మంది కరోనా టీకా తొలి డోస్, 58శాతం మంది రెండో డోస్ వేసుకున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించడం గురించి ఈనెల 31న సీఎం అధ్యక్షతన జరుగనున్న సమావేశం తర్వాత ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కచ్చితంగా రెండు డోసుల టీకా పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
105నుంచి 194కి చేరిన కేసులు
రాష్ట్రంలో నవంబర్ 28న 105కేసులు నమోదుకాగా, గత వారం చివరికి 115 కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.మంగళవారం నాటికి కేసుల సంఖ్య 194కు చేరిందన్నారు.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 619 కేసులు నమోదు కాగా మూడింట ఒక వంతు కేసులు చెన్నైలోనే నమోదయినట్లు తెలిపారు. సోమవారం 605 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.కరోనా పరీక్షలు రెట్టింపు చేసినట్లు తెలిపారు.తాజాగా జరిగిన సమావేశంలో సీఎం స్టాలిన్ చెన్నై ట్రేడ్ సెంటర్‌లో కరోనా రెండో దశ సమయంలో ఆక్సిజన్ వసతితో కూడిన 800 పడకలు ఏర్పాటు చేసిన విధంగా తిరిగి సిద్ధం చేయాలని ఆదేశించారని తెలిపారు.నాలుగైదు రోజుల్లో 800 పడకలు ఉపయోగంలోకి తేనున్నట్లు తెలిపారు.