Delhi excise Scam: లిక్కర్‌ స్కామ్‌ కేసులో ‘ఆప్‌’ పేరు.. చేర్చే యోచనలో సీబీఐ, ఈడీ

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) పేరును చేర్చడం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. నిందితుల జాబితాలో ఆప్‌ పేరును చేర్చే యోచనలో ఉన్నట్లు సీబీఐ, ఈడీ తాజాగా సుప్రీంకు తెలిపాయి. 

Published : 16 Oct 2023 17:00 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi Excise Policy Scam Case) నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) పేరును చేర్చే యోచనలో ఉన్నట్లు సీబీఐ (CBI), ఈడీ (ED) దర్యాప్తు సంస్థలు సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court)కు తెలిపాయి. ఈ కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా బెయిల్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు.. కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించారు.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్లు, నిబంధనల ప్రకారం.. ఆమ్‌ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నట్లు ఏఎస్‌జీ రాజు తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం.. ఈ కేసులో ఆప్‌ (AAP)పై  వేరే అభియోగాలు ఏమైనా మోపుతారా? అని ప్రశ్నించింది. దీనిపై మంగళవారం నాటికి స్పష్టతనివ్వాలని సూచించింది. అనంతరం సిసోదియా బెయిల్‌ పిటిషన్లపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఆ ‘గుండె చప్పుడు’ ఆపలేం.. గర్భవిచ్ఛిత్తికి నిరాకరించిన సుప్రీం కోర్టు

మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam)లో ప్రధాన లబ్ధిదారు ఆమ్‌ ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్‌.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇటీవల పరిశీలించిన సుప్రీంకోర్టు.. దర్యాప్తు సంస్థలకు కీలక ప్రశ్నలు సంధించింది.

‘‘మీరు నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసు ప్రకారం ముడుపుల సొమ్ము మొత్తం ఆ రాజకీయ పార్టీకి వెళ్లాయి. లబ్ధిదారు ఆ పార్టీయే కానీ మనీశ్‌ సిసోదియా కాదు. మరి ఆ పార్టీ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చ లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని ప్రశ్నించింది. దీంతో ఈ అంశంపై సీబీఐ, ఈడీ కసరత్తులు చేశాయి. న్యాయనిపుణుల సలహాను కూడా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే నిందితుల జాబితాలో ఆప్‌ పేరును చేర్చేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని