Viral News: అమితాబ్‌ సహాయకుడికి చెందిన రూ.1.4లక్షల ఫోన్‌ వాపస్‌ చేసిన కూలీ

రోజుకు రూ. 300 సంపాదించే ఓ కూలీకి రూ.1.4లక్షలు విలువైన ఫోన్‌ దొరికింది. కానీ, అతడు నిజాయతీగా దానిని యజమాని వద్దకు చేర్చడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Updated : 22 Mar 2023 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్: రోడ్డుపై రూ.10 నోటును చూస్తే  అటూఇటూ చూసి జేబులో పెట్టుకొని వెళ్లిపోయే జనం ఉన్న ఈ రోజుల్లో ఓ కూలీ రూ.1.4లక్షల విలువైన ఫోన్‌ దొరికితే దానిని యజమాని వద్దకు చేర్చాడు.  ముంబయిలోని దాదర్‌ స్టేషన్‌లో దశరథ్‌ దౌండ్‌ 62 ఏళ్ల అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. రోజువారీ రూ.300 సంపాదనతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అతడు ఎప్పటిలానే సోమవారం రాత్రి 11.30కు అమృత్‌సర్‌కు వెళ్లే ఓ రైలులో లగేజీని ఎక్కించి తిరిగి వస్తుండగా.. ప్రయాణికులు కూర్చొనే చోట ఓ ఖరీదైన ఫోన్‌ పడిఉండటాన్ని గమనించాడు. వెంటనే దానిని తీసుకొని చుట్టుపక్కల వ్యక్తులను వాకబ్‌ చేశాడు. వారెవరూ ఆ ఫోన్‌ తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో దశరథ్‌ దానిని జీఆర్‌పీ (గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ ) చౌకీ వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు. 

ఆ ఫోన్‌ విలువ రూ.1.4 లక్షలు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) మేకప్‌ ఆర్టిస్టుగా పేరున్న దీపక్‌ సావంత్‌దిగా పోలీసులు గుర్తించారు. అప్పటికే దశరథ్‌ తన పని ముగించుకొని నిద్రకు ఉపక్రమించాడు. కొద్ది సేపటికే పోలీసులు అతడికి ఫోన్‌ చేసి యజమానిని గుర్తించామని వెల్లడించారు. సావంత్‌ కూడా అక్కడకు చేరుకొని తన ఫోన్‌ తీసుకొన్నాడు. దశరథ్‌ చేసిన పనిని అతడు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అభినందించింది. సావంత్‌ అతడికి కొంత నగదు బహుమతిని కూడా అందజేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని