కరోనా ‘మహా’ విజృంభణపై కేంద్రం ఆందోళన

కరోనా వైరస్‌ కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు.......

Updated : 11 Mar 2021 18:15 IST

యాక్టివ్‌ కేసుల్లో టాప్‌ 10 జిల్లాలివే..
 

దిల్లీ: కరోనా వైరస్‌ కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో మరోసారి కేసులు నమోదవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలో కేసులు పెరుగుతండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోందని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. కరోనా రహిత దేశంగా మారేందుకు ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేలా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మరోవైపు, దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు అధికంగా ఉన్న 10 జిల్లాల జాబితాను ప్రకటించారు. వీటిలో ఎనిమిది జిల్లాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని తెలిపారు. మరోవైపు, కేరళ, యూపీలలో కేసులు తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. దేశంలో కరోనా మరణాల రేటు తగ్గుతోందని, రికవరీల రేటు పెరుగుతోందని వివరించారు. దేశంలో ఇప్పటిదాకా 2.56కోట్ల మందికి పైగా టీకా పంపిణీ జరిగిందని,  ప్రైవేటు ఆస్పత్రుల్లో వారంలో అన్ని రోజులూ కొవిడ్‌ టీకాలు పంపిణీ జరుగుతుందని అధికారులు స్పష్టంచేశారు.

ఆ టాప్‌ 10 జిల్లాలివే..
పుణె, నాగ్‌పూర్‌, ఠానే, ముంబయి, బెంగళూరు అర్బన్‌, ఎర్నాకుళం, అమరావతి (మహారాష్ట్ర), జల్‌గావ్‌, నాసిక్‌, ఔరంగాబాద్‌. వీటిలో మహారాష్ట్రలో ఎనిమిది జిల్లాలు ఉండగా.. కేరళ, కర్ణాటకల నుంచి ఒక్కో జిల్లా ఉన్నాయి.


మహారాష్ట్ర పైకి.. కేరళ కిందకు..!

కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఫిబ్రవరి 11న ఉన్న పరిస్థితిని నేటితో పోల్చి చూస్తే.. మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసులు భారీగా పెరగ్గా.. కేరళలో తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 11 నాటికి దేశంలోనే అత్యధిక యాక్టివ్‌ కేసులు  కేరళలో ఉండగా.. ఇప్పుడక్కడ తగ్గుముఖం పట్టగా.. లక్షకు పైగా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అలాగే, యూపీ, పశ్చిమబెంగాల్‌లో యాక్టివ్‌ కేసుల్లో తగ్గుదల నమోదు కాగా.. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణాలలో పెరుగుదల నమోదైనట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని