Corona: దిల్లీలో 23 శాతానికి పెరిగినకొవిడ్‌ పాజిటివిటీ రేటు!

దేశరాజధాని దిల్లీలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాడు కొత్తగా 22,751 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతోపాటు 17 మరణాలు సంభవించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 09 Jan 2022 23:56 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 22,751 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతోపాటు 17 మరణాలు సంభవించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 23.53 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం 1618 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా వారిలో 44మంది వెంటిలేర్‌ అవసరమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మే 1 తర్వాత దిల్లీలో ఈ తరహా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మే నెలలో గరిష్ఠంగా 25వేల కేసులు నమోదు కాగా.. పాజిటివిటీ రేటు 31గా నమోదైంది. ప్రస్తుతం దిల్లీలో క్రియాశీల కేసుల సంఖ్య 60వేలు దాటగా వారిలో 35వేల మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

ముంబయిలోనూ..

అటు ముంబయిలోనూ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 19,474 కేసులు నమోదైనట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. వీటిలో 82 శాతం లక్షణాలు లేని కేసులేనని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో 1240 మంది ఆస్పత్రుల్లో చేరగా వారిలో 118 మందికి ఆక్సిజన్‌ అవసరం అయినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. అంతకు ముందురోజు 20,318 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఆదివారం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది. నగరంలో మరో ఏడుగురు కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో ముంబయిలో మొత్తం కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య లక్షా 11వేలకు చేరింది. వీరిలో మొత్తంగా దాదాపు 8వేల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా సోమవారం నుంచి మహారాష్ట్రలో మరిన్ని ఆంక్షలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి కర్ఫ్యూ, పగటిపూట ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా కట్టడి, ప్రైవేటు సంస్థల్లో 50శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవడం వంటి ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని