Corona: ఫిబ్రవరి 15 నాటికి తగ్గుముఖం పట్టనున్న కరోనా కేసులు..!

భారత్‌లో ప్రస్తుతం కరోనా మూడోవేవ్‌ నడుస్తోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 3 లక్షలపైనే నమోదవుతున్నా.. మూడురోజులుగా వాటిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది.

Published : 25 Jan 2022 01:09 IST

అంచనా వేసిన ప్రభుత్వ వర్గాలు

దిల్లీ: భారత్‌లో ప్రస్తుతం కరోనా మూడోవేవ్‌ నడుస్తోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 3 లక్షలపైనే నమోదవుతున్నా.. మూడురోజులుగా వాటిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే మాట చెప్పాయి. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అలాగే టీకా కార్యక్రమం మూడోవేవ్ ప్రభావాన్ని తగ్గించిందని పేర్కొన్నాయి. 

‘ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం, స్థిరంగా ఉండటం ప్రారంభమైంది’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం తెలిపిన గణాంకాల ప్రకారం.. ఈ రోజు(జనవరి 24) 3,06,064 కరోనా కేసులు వెలుగుచూశాయి. జనవరి 23న 3.33 లక్షలు, జనవరి 22న 3.37 లక్షలు, జనవరి 21న 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి. మూడు రోజులుగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. మరోపక్క ప్రస్తుతం దేశంలో 74 శాతం మంది అర్హులైన వయోజనులు రెండు డోసుల టీకా తీసుకున్నారు. 15 నుంచి 18 మధ్య వయస్సులో ఉన్న టీనేజర్లకు తొలి డోసు ఇస్తున్నారు. 60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోసు ఇవ్వడం వంటి చర్యలు థర్డ్ వేవ్‌ తీవ్రతను తగ్గించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  

ఇదిలా ఉండగా.. జనవరి ప్రారంభంలో కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా వేవ్‌కు ప్రధాన కారణం. దేశంలో ఈ వేరియంట్ సమూహ వ్యాప్తి స్థాయికి చేరిందని, రానున్న వారాల్లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అలాగే ప్రధాన నగరాల్లో కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కొత్త కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించనప్పటికీ.. ఏ మాత్రం అజాగ్రత్తవద్దని చెబుతున్నారు.  

శరద్‌పవార్‌కు కరోనా పాజిటివ్‌: 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘ప్రధాని మోదీ ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన చూపిన శ్రద్ధకు నేను కృతజ్ఞుడిని’ అని తెలిపారు. అలాగే  ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని