చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే..

పిల్లల్లో ఉండే సహజ రోగనిరోధక శక్తి, వారు తీసుకొనే టీకాల వల్ల వారిపై కరోనా అంతగా ప్రభావం చూపదని నిజామాబాద్‌కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ హరికృష్ణ వెల్లడించారు.

Updated : 18 May 2021 15:51 IST

నిజామాబాద్‌: పిల్లల్లో ఉండే సహజ రోగనిరోధక శక్తి, వారు తీసుకొనే టీకాల వల్ల వారిపై కరోనా అంతగా ప్రభావం చూపదని నిజామాబాద్‌కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ హరికృష్ణ వెల్లడించారు. పిల్లల్లో కరోనా ప్రభావం, ఒక వేళ కరోనా సోకితే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై ఉన్న సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు.

* చిన్నారుల్లో కరోనా లక్షణాలు ఎలా ఉంటున్నాయి?

మొదటి దశతో పోలిస్తే రెండో దశలో పిల్లల్లో కరోనా కేసులు పెరిగినా వైరస్‌ తీవ్రత వారిపై అంతగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, నీరసం, వాసన తెలియకపోవడం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులను కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చు.  కొందరు చిన్నారుల్లో వాంతులు, విరోచనాలతో పాటు కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు కూడా వస్తున్నాయి.

* ఎటువంటి సందర్భాల్లో ఆస్పత్రిలో చేర్చాల్సి ఉంటుంది? హోం ఐసోలేషన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

90 శాతం మంది పిల్లలు హోం ఐసోలేషన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకోవడంతోనే కరోనా నుంచి బయటపడుతున్నారు. చిన్నారులకు ఎటువంటి లక్షణాలు లేకుండా తల్లికిగానీ, తండ్రికి గానీ కొవిడ్‌ సోకినట్లైతే వారిని ప్రత్యేకంగా సంరక్షించాలి.  స్వల్ప లక్షణాలున్న చిన్నారులకు జ్వరం వచ్చినపుడు సాధారణ పారాసిటమాల్‌ సిరప్‌ వాడాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే పిల్లల్లో న్యుమోనియా లక్షణాలుండొచ్చు. అలాంటి సందర్భాల్లో వారిని వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చాల్సి ఉంటుంది.

* కరోనా సోకిన తల్లి పాలను బిడ్డకు పట్టొచ్చా? అటువంటి సందర్భాల్లో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

నవజాత శిశువులకు తల్లి పాలు నిస్సందేహంగా పట్టొచ్చు. వాటి ద్వారా కరోనా సోకుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. అంతేకాకుండా అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి పెరగడంలో తల్లి పాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆ సమయంలో తల్లి తన చేతులు శుభ్రపరచుకొని, మాస్కు ధరించి పాలు పట్టాలి. ఒక వేళ తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఆ పాలను శుభ్రమైన కంటైనర్‌లోకి పిండి వాటిని శిశువుకు అందించాలి.

* చిన్నారుల్లో కరోనా ఎలాంటి ప్రభావం చూపుతుంది?

చిన్నారుల్లో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. వారిలో సహజంగా ఉండే రోగ నిరోధకశక్తితో పాటు వారికి తరచూ వేయించే టీకాల ప్రభావంతో కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.

* ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులకు కరోనా సోకకుండా అడ్డుకోవచ్చు?

పిల్లలకు కరోనా పెద్దవారి నుంచే సోకుతుంది. కాబట్టి మనం జాగ్రత్తలు పాటిస్తూ వారిని సంరక్షించాలి. ఐదేళ్ల లోపు చిన్నారులకు మాస్కు అవసరం లేదు. ఐదేళ్లు పైబడిన చిన్నారులకు తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, మాస్కు ధరించడం వంటి వాటిని అలవాటు చేయాలి. తాజా పండ్లను పిల్లలు ఎక్కువగా తీసుకొనేలా చూడాలి.  వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌, మినరల్స్ వల్ల వారి రోగనిరోధకశక్తి బలపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని