కరోనా ఉద్ధృతి: ఒకేరోజు 93వేల కేసులు!

భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్‌ కేసులు సంఖ్యలో పెరుగుదల నమోదు కాగా, మరణాలు కొంతమేర తగ్గాయి. గడిచిన 24గంటల్లో 11.66లక్షల పరీక్షలు చేయగా..

Updated : 04 Apr 2021 10:28 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొవిడ్‌ కేసులు సంఖ్యలో పెరుగుదల నమోదు కాగా, మరణాలు కొంతమేర తగ్గాయి. గడిచిన 24గంటల్లో 11.66లక్షల పరీక్షలు నిర్వహించగా.. 93,249 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. కొత్తగా 60,048మంది కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,16,29,289కు చేరి.. రికవరీ రేటు 93.36శాతానికి పడిపోయింది. 

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 714 నమోదు కాగా.. శనివారం ఆ సంఖ్య కొంత తగ్గింది. మొత్తం 513 మంది కరోనాతో మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,64,623కు పెరిగింది. ఇక మరణాల రేటు 1.32 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 6,91,597కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 27.38లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 7,59,79,651కి చేరింది.

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు
మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. శనివారం ఒక్కరోజే దాదాపు 49,447 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 277మరణాలు నమోదు కాగా, 37,821 మంది డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 29.53లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 24.95లక్షల మంది కోలుకోగా.. 55,656 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 4.02లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కర్ణాటకలో థియేటర్లలో 50శాతం సీట్లకే అనుమతి
కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో సినిమా థియేటర్ల సీట్ల పరిమితిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో సీట్ల పరిమితిని 50శాతానికి కుదిస్తూ శుక్రవారం జారీ చేసిన ఆదేశాలు.. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వు చేసుకొన్న వినియోగదారులు నష్టపోతారంటూ కన్నడ సినీ పరిశ్రమ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడంతో.. ఈ ఆదేశాల అమలు తేదీని సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ శనివారం ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. 
కాగా, కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో దాదాపు 4,373 వేల కేసులు నమోదయ్యాయి. కరోనాతో 19మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని