పెరుగుతున్న ఉత్పరివర్తనల ముప్పు!

ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వైరస్‌లో వేగంగా కొత్త మార్పులు (ఉత్పరివర్తనలు) చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు టీకాలు

Published : 20 Jan 2021 11:57 IST

వ్యాక్సినేషన్‌లో జాప్యంతో మరిన్ని ఇబ్బందులు 
పరీక్షల్లో గుర్తించలేని స్ట్రెయిన్‌ రావొచ్చు 
శాస్త్రవేత్తల హెచ్చరిక 

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వైరస్‌లో వేగంగా కొత్త మార్పులు (ఉత్పరివర్తనలు) చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు టీకాలు వేయడంలో జాప్యం జరిగే కొద్దీ కొత్త రకాలకు ఆస్కారం పెరుగుతుందని నిపుణులు చెప్పారు. ప్రస్తుత పరీక్షా విధానాలు, చికిత్సలు, టీకాలను ఏమార్చే వైరస్‌ రకం (స్ట్రెయిన్‌) ఉత్పన్నమయ్యే ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరించారు. అందువల్ల ఏ మాత్రం అలసత్వానికి తావివ్వకుండా కొవిడ్‌ జాగ్రత్తలను కొనసాగించాలని సూచించారు. 

కరోనా వైరస్‌లో జన్యు వైవిధ్యం నానాటికీ పెరుగుతోంది. కొత్త కేసుల ఉద్ధృతి పెరగడమే ఇందుకు కారణô. ప్రతి కొత్త ఇన్‌ఫెక్షన్‌.. మార్పు చెందడానికి వైరస్‌కు ఒక అవకాశం కల్పిస్తుందని నిపుణులు తెలిపారు. మహమ్మారి నియంత్రణపై పోరులో సాధించిన పురోగతిని ఇది దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త రకాలను గుర్తించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా కోరింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన కొత్త రకం కరోనా.. మార్చి నాటికల్లా అమెరికాలోని వైరస్‌ రకాల్లో సింహ భాగాన్ని ఆక్రమిస్తుందని ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’ (సీడీసీ) అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రకం వల్ల తీవ్ర అనారోగ్యం కలగనప్పటికీ అది చాలా సులువుగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల.. ఆసుపత్రిలో చేరే బాధితులు, మరణాల సంఖ్య పెరుగుతాయని పరిశోధకులు తెలిపారు. దీంతోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో మొదట వెలుగు చూసిన రెండు కొత్త కొత్త రకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్‌ రకం ఇప్పుడు 30 దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి సాధ్యమైనన్ని చర్యలను చేపట్టాలని హార్వర్డ్‌ వర్సిటీ నిపుణుడు మైఖేల్‌ మినా వివరించారు. కొత్త రకాలు ఉద్భవించకుండా చూడటానికి ఇదే ఉత్తమ మార్గమని చెప్పారు. 

ఒక్క మార్పుతో.. 
కరోనా వైరస్‌ను మరింత ప్రమాదకరంగా మార్చే ఉత్పరివర్తన ఎప్పుడైనా రావొచ్చని పరిణామక్రమ జీవశాస్త్రవేత్త పార్డిస్‌ సబేటి పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన వైరస్‌ రకం వల్ల యువత తీవ్ర అనారోగ్యం బారినపడటానికి ఆస్కారం తక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల వారు మాస్కులు ధరించడానికి, భౌతిక దూరం పాటించడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదని ఆమె తెలిపారు. అయితే ఒక్క ఉత్పరివర్తన వల్ల పరిస్థితి మొత్తం మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2014లో ఎబోలా విజృంభణ సమయంలోనూ సదరు వైరస్‌లో వచ్చిన ఒకేఒక్క మార్పుతో పరిస్థితి ప్రమాదకరంగా మారిన తీరును ఆమె అప్పట్లో వెలుగులోకి తెచ్చారు. కరోనాలో కొత్తగా వచ్చే రకాల వల్ల ప్రస్తుత వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఆ వైరస్‌ బయటపడని పరిస్థితి ఉత్పన్నం కావొచ్చని వివరించారు.

కొత్త చికిత్సలు అవసరం
ఇటీవల దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌లు.. యాంటీబాడీ చికిత్సలు లేదా కాన్వలసెంట్‌ ప్లాస్మాకు పెద్దగా స్పందించకపోవచ్చని కొన్ని ల్యాబ్‌ ప్రయోగాలు సూచిస్తున్నాయి. అందువల్ల ఒకే యాంటీబాడీ ఔషధాలకు బదులు బహుళ యాంటీబాడీలతో చికిత్స చేయడం వల్ల ప్రయోజనం ఉండొచ్చని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నిపుణురాలు జానెట్‌ వుడ్‌కుక్‌ చెప్పారు. 

ప్రయాణ ఆంక్షలతో ప్రయోజనం తక్కువే 
వైరస్‌లు తమ సంఖ్యను పెంచుకునే క్రమంలో వాటి జన్యువుల్లో స్వల్ప మార్పులు సహజమే. వాటిలో కొన్ని మార్పులు.. వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతం కావడానికి కారణమవుతాయి. గత ఏడాది మార్చిలో కరోనాలో డీ614జీ అనే ఉత్పరివర్తన వెలుగు చూసింది. కొద్దినెలల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌లలో సింహభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత మళ్లీ బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవి ప్రజా ప్రయాణాల వల్ల ఉత్పన్నమైనవి కాకపోవచ్చని, ఇన్‌ఫెక్షన్లు పెరిగే కొద్దీ.. వైరస్‌ స్వతంత్రంగా ఎక్కడికక్కడ వీటిని సముపార్జించుకుంటోందని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాన్‌ జోన్స్‌ పేర్కొన్నారు. ప్రయాణ ఆంక్షలతో కొత్త రకాల వ్యాప్తికి సమర్థంగా అడ్డుకట్టపడకపోవచ్చని వివరించారు. ‘‘అదే స్థాయిలో లేదా అంతకన్నా ప్రమాదకరమైన రకాలు మన దేశంలోనూ ఉత్పన్నం కావొచ్చు’’ అని పేర్కొన్నారు. వైరస్‌లో మార్పుల వల్ల రీఇన్‌ఫెక్షన్లు పెరగొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రస్తుతానికి టీకాలు సరే.. 
వినియోగంలో ఉన్న కొవిడ్‌ టీకాలు సమర్థంగానే పనిచేస్తున్నాయని, సరిపడా రోగనిరోధక స్పందనను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వైరస్‌లో భారీగా జన్యు మార్పులు చోటుచేసుకుంటే టీకా ఫార్ములాలో మార్పు చేయాల్సి ఉంటుందన్నారు. టీకాలను సమర్థంగా వేస్తే.. వైరస్‌లో ఆ మార్పు రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చని ఉతా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆండ్రూ పావియా చెప్పారు.

ఇవీ చదవండి..

భారత్‌: యాక్టివ్‌ కేసులు.. 2లక్షలకు దిగువన

ఒక్క అధ్యక్షుడు.. ఆరు అధ్యక్ష భవనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని