Third Wave: అక్టోబర్‌నాటికి మూడో ముప్పు..?

భారత్‌లో అక్టోబర్‌ నాటికి థర్డ్‌వేవ్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated : 18 Jun 2021 18:54 IST

నియంత్రణ సాధ్యమే అంటున్న నిపుణులు

బెంగళూరు: కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి వణికిపోయిన రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావిస్తోన్న రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నాటికి థర్డ్‌వేవ్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే మూడో ముప్పును సమర్థంగానే నియంత్రించే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.

దేశంలో కరోనా ఉద్ధృతి, రానున్న రోజుల్లో వైరస్‌ ప్రభావం గురించి జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో రాయిటర్స్‌ వార్తా సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. జూన్‌ 3 నుంచి 17 మధ్య చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 40మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు. భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ ప్రక్రియను చూస్తుంటే రానున్న రోజుల్లో సంభవించే మరో ముప్పును నియంత్రించవచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అక్టోబర్‌లో మూడో ముప్పు!

దేశంలో కరోనా వైరస్‌ మూడో ముప్పు ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు బదులిచ్చిన 24మంది నిపుణుల్లో  21మంది అక్టోబర్‌ నాటికి మరోసారి విజృంభణ తప్పదని అభిప్రాయపడ్డారు. మరో ముగ్గురు మాత్రం నవంబర్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం వైరస్‌ను ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే రానున్న ముప్పును సమర్థవంతంగా నియంత్రించవచ్చని మెజారిటీ నిపుణులు స్పష్టం చేశారు.

పిల్లలపై ప్రభావమెంత?

మూడో విజృంభణ పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్నకు దాదాపు సర్వేలో పాల్గొన్న నిపుణుల్లో మూడోవంతు (26మంది) అవుననే సమాధానమిచ్చారు. మరో 14 మంది మాత్రం పిల్లలకు ప్రమాదమేమీ లేదన్నారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడమే ముప్పుకు కారణమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎపిడమాలజిస్టు డాక్టర్‌ ప్రదీప్‌ బనాందూర్‌ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చిన్నారులకు సంబంధించి ఐసీయూ పడకలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ముప్పు ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని కొవిడ్‌పై కర్ణాటక ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ దేవీ శెట్టి హెచ్చరించారు. అయితే థర్డ్‌వేవ్‌లో చిన్నారులకు వైరస్‌ సోకినప్పటికీ తీవ్రత మాత్రం తక్కువగానే ఉండే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ మధ్యే వెల్లడించారు.

నియంత్రణ సాధ్యమే..

భవిష్యత్తులో వచ్చే కొత్తరకం వేరియంట్లు వ్యాక్సిన్‌పై అంతగా ప్రభావం చూపకపోవచ్చని, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు వాటిని సమర్థంగానే ఎదుర్కొంటాయని 25మంది నిపుణులు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ముప్పు మరో ఏడాదిపాటు ఉంటుందని సర్వేలో పాల్గొన్న 31 మంది నిపుణులు(75శాతం) స్పష్టం చేశారు. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే మూడో ముప్పును నియంత్రించవచ్చని, కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. అక్టోబర్‌ నాటికి చాలామందికి వ్యాక్సిన్‌ అందడంతోపాటు రెండోవేవ్‌ వల్ల కలిగే రోగనిరోధకత దీనికి దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్‌ సమస్య అధిగమించగలిగేదే. ముఖ్యంగా వ్యాక్సిన్ల రాకతో ఇది సాధ్యం. వ్యాక్సిన్‌ పంపిణీతోపాటు, ప్రజలు వైరస్‌కు గురికావడం వల్ల రానున్న రెండేళ్లలో కరోనాపై భారత్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధిస్తుంది’ అని అంతర్జాతీయ వైరాలజీ నిపుణుడు రాబర్ట్‌ గల్లో అంచనా వేశారు. ఏదేమైనా మూడోముప్పును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని