Corona: మహారాష్ట్ర, దిల్లీలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. ఈరోజు కేసులెన్నంటే?

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. .....

Published : 09 Jun 2022 20:25 IST

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్రలో నిన్న 2701 కేసులు రాగా.. గడిచిన 24గంటల వ్యవధిలో మరో 2,813 కొత్త కేసులతో పాటు ఒక మరణం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, 1047మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. తాజాగా బయటపడిన ఇన్ఫెక్షన్లతో మహారాష్ట్రలో క్రియాశీల కేసుల సంఖ్య 11,571కి పెరిగింది. ఈరోజు వచ్చిన వాటిలో ఒక్క ముంబయిలోనే 1,702 కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా కేసులతో కలిపితే మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 79,01,628కి చేరింది. వీటిలో 77,42,190 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,47,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం 11,571 క్రియాశీల కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 7,998 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఠానేలో 1984, రాయిగఢ్‌లో 319 చొప్పున ఉన్నాయి. 

దిల్లీలో ఇద్దరి మృతి

అటు, దిల్లీలోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 19,619 టెస్టులు చేయగా.. 622 మందిలో ఈ మహమ్మారి వెలుగుచూసింది. తాజాగా 537మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కరోనాతో పోరాడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో దిల్లీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 19,10,613కి చేరింది. వీరిలో 18,82,623 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 26,216 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,774కి చేరింది.

టెస్టులు పెంచండి.. కేంద్రం లేఖ
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 7240 కొత్త కేసులు రావడం.. వీటిలో 81శాతం మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటకల్లోనే ఉండటంతో గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇన్ఫెక్లన్లను తగ్గించడమే లక్ష్యంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ లేఖ రాశారు. వైరస్‌ను ముందుగా గుర్తించి వ్యాప్తిని నిరోధించడంలో టెస్టింగ్‌లదే కీలక పాత్ర అనీ.. అందువల్ల విస్తృతస్థాయిలో టెస్టులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సిన్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం అనే ఐదంచెల వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్‌ కట్టడికి ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని