Corona Updates: స్వీయ నిర్బంధంలోకి ప్రియాంక.. 38 మంది కోబ్రా జవాన్లకు కరోనా!

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ ప్రవేశించాక రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత.......

Published : 04 Jan 2022 02:00 IST

సుక్మా: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ ప్రవేశించాక రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్‌పీఎఫ్‌ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు. దీంతో వీరందరినీ క్యాంపులోనే క్వారంటైన్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. 202 బెటాలియన్‌కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) అనేది సీఆర్‌పీఎఫ్‌లో ఓ విభాగమని, తెమెల్వాడాలో క్యాంపులో విధుల కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆదివారం ఇక్కడకు వచ్చినట్టు వెల్లడించారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌లో భాగంగా 75 మందికి యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సుక్మా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సీవీ బన్సోడ్‌ వివరించారు. వారి స్వాబ్‌తో కూడిన శాంపిల్స్‌ని ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షల కోసం జగదల్‌పూర్‌కు పంపినట్టు చెప్పారు. వారి కాంటాక్టులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

తొలిరోజు 38 లక్షల మంది టీనేజర్లకు టీకా

దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా పంపిణీ తొలిరోజే విశేష స్పందన లభించింది. దాదాపు 38 లక్షల మంది టీనేజర్లకు కొవాగ్జిన్‌ డోసులు పంపిణీ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు 38,84,212 మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ పంపిణీ జరిగినట్టు కొవిన్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేశారు. 

స్వీయ నిర్బంధంలో ప్రియాంకా గాంధీ

తమ కుటుంబంలో ఒకరికి, తన సిబ్బందిలో మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. తాను పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చిందన్నారు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటానని, కొద్దిరోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకోనున్నట్టు ప్రియాంక తెలిపారు. 

ముంబయిలో ఒకేరోజు 8వేలకు పైనే కొత్తకేసులు

మహారాష్ట్రలోని ముంబయి నగరం మరోసారి కరోనాతో వణుకుతోంది. తాజాగా 8,082 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 90 శాతం బాధితుల్లో లక్షణాలే లేవని బీఎంసీ అధికారులు వెల్లడించారు. అలాగే, ఇద్దరు కొవిడ్‌తో మృతిచెందినట్టు తెలిపారు.

క్రూజ్‌ నౌకలో కరోనా కల్లోలం.. 66 మందికి కరోనా

ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ కార్డెలియా క్రూజ్‌ నౌకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దాదాపు 2000 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఈ భారీ నౌకలో 66 మందిలో ఈ వైరస్‌ వెలుగుచూసినట్టు గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణె వెల్లడించారు. ఈ సమాచారాన్ని సంబంధిత కలెక్టర్లకు, ముంబయి పోర్టు ట్రస్ట్‌కు ఇచ్చామని, ప్రయాణికులు నౌక నుంచి బయటకు వచ్చే విషయంలో అధికారులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని