Updated : 20 Jan 2022 20:38 IST

Corona Updates: టీనేజర్లకు టీకాలో ఆంధ్రప్రదేశే టాప్‌.. మరో సినీ నటుడుకి కరోనా పాజిటివ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి విస్ఫోటనం కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో  గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 3.17లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ భారీ సంఖ్యలో ఇన్ఫెక్షన్లు పెరగడం కలవరపెడుతోంది. దేశంలోని పలు చోట్ల కొవిడ్‌తో ఏర్పడిన పరిస్థితులకు సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌..

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో టీనేజర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని కేంద్రం తెలిపింది. ఈ నెల 10న ప్రారంభమైన 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 52శాతం టీకా తొలి డోసు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. టీనేజర్లకు టీకా పంపిణీలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు. 91శాతం మందికి పంపిణీ చేసిన ఏపీ టాప్‌లో ఉండగా.. 83%తో హిమాచల్‌ప్రదేశ్‌ రెండో స్థానంలో, 71%తో మధ్యప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండగా.. ఇప్పటివరకు  55శాతం మందికి టీకా పంపిణీ చేసిన తెలంగాణ 19వ స్థానంలో ఉన్నట్టు కేంద్రం వివరించింది.


దిల్లీలో కేసులు తగ్గినా.. భారీగా మరణాలు!

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 10శాతం కేసులు తగ్గినప్పటికీ పెద్ద సంఖ్యలో మరణాలు వెలుగుచూశాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దిల్లీలో 57,290 టెస్టులు చేయగా.. 12,306 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బాధితుల్లో 18,815మంది కోలుకోగా.. 43మంది మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. గతేడాది జూన్‌ 10 తర్వాత ఇంత భారీగా మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ 68,710 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేసులు తగ్గడంతో పాజిటివి రేటు 21.48శాతానికి తగ్గింది.


సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌కు కరోనా పాజిటివ్‌
ప్రముఖ సినీనటుడు, మలయాళీ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా షూటింగ్‌లలో తనతో కాంటాక్టు అయిన వ్యక్తులు ఐసోలేట్‌ అవ్వాలనీ, లక్షణాలేమైనా గుర్తిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదనీ.. అంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు. మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలన్నారు. ఇటీవల మమ్ముట్టి కూడా కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. 


మహారాష్ట్రలో 24నుంచి తరగతులు పునఃప్రారంభం

ముంబయి: కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులందరికీ భౌతిక తరగతులు పునఃప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ వెల్లడించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ఆమోదం తెలిపారన్నారు. దీనిపై లిఖితపూర్వక ఆదేశాలు త్వరలో జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఒమిక్రాన్‌ ప్రభావంతో పెద్ద ఎత్తున కొవిడ్‌ కేసులు బయటపడటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జనవరి తొలి వారం నుంచి మహారాష్ట్రలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పాఠశాలలు మూసివేయడం విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ పలువురు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, గత కొన్ని రోజులుగా ముంబయిలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ñముంబయిలో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు భౌతిక తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు నగర మున్సిపల్‌ కమిషనర్‌ స్పష్టంచేశారు. 


ఐసీయూలోనే లతా మంగేష్కర్‌.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

ముంబయి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నారు. జనవరి 8న కరోనా బారినపడటంతో ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ లెజెండరీ గాయని తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికారప్రతినిధి అనుషా శ్రీనివాసన్‌ అయ్యర్‌ ప్రకటన విడుదల చేశారు. ‘లతా దీదీ ఐసీయూలోనే ఉన్నారు. డాక్టర్‌ ప్రతీత్‌ సమదాని నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకొని ఇంటికి రావాలని ప్రార్థిద్దాం’ అని పేర్కొన్నారు.


మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు మోదీ ఫోన్‌

దిల్లీ: కొవిడ్‌ బారిన పడిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ అగ్రనేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌ సోకడంతో ప్రకాశ్‌సింగ్‌ బాదల్ లుథియానాలోని దయానంద్‌ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని