
Corona Updates: మాజీ ప్రధాని దేవెగౌడకు రెండోసారి కరోనా
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ ప్రభావంతో గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఉద్ధృతి కాస్త తగ్గినప్పటికీ శుక్రవారం కూడా 3లక్షలకు పైనే కొత్త కేసులు వచ్చాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నా.. భారీ సంఖ్యలో జనం ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. దేశంలోని పలు చోట్ల కొవిడ్ పరిస్థితిపై కొన్ని అప్డేట్స్..
మాజీ ప్రధాని దేవెగౌడకు రెండోసారి కరోనా
బెంగళూరు: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మరోసారి కరోనా బారినపడ్డారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటికీ లక్షణాలేమీ లేవని సమాచారం. అయితే, ఆయన్ను మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన సతీమణి చెన్నమ్మకు నెగెటివ్ వచ్చిందని.. ఆమె ఇంట్లోనే ఉన్నారు. గతేడాది మార్చిలో దేవెగౌడ, ఆయన సతీమణి కొవిడ్ బారినపడిన విషయం తెలిసిందే. మరోవైపు, దేవెగౌడ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే, మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాని ప్రార్థిస్తూ కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్ కె.సుధాకర్ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.
కేరళ జైళ్లపై కరోనా పంజా
తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తిరువనంతపురంలోని పూజప్పుర సెంట్రల్ జైలులో 262మందికి పైగా ఖైదీలకు కొవిడ్ సోకింది. గత మూడు రోజుల వ్యవధిలో 936మంది ఖైదీలకు యాంటీజెన్ పరీక్షలు చేయగా.. 262 మందికి పాజిటివ్‌గా వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక వైద్యులను నియమించాలని జైలు సూపరింటెండెంట్ ప్రభుత్వాన్ని కోరారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ ప్రత్యేక సెల్లో ఉంచినట్టు చెప్పారు. అలాగే, కన్నూరు జైలులో 10మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. కేరళలో శుక్రవారం ఒక్కరోజే 41,668 పాజిటివ్ కేసులు రాగా.. ఒక్క తిరువనంతపురంలోనే అత్యధికంగా 7876 కేసులు రావడం గమనార్హం.
యూపీలో 30వరకు స్కూళ్లు మూత
కరోనా కేసులు పెరుగుతున్న వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పాఠశాలల మూసివేతను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 30 వరకు ఆన్లైన్లోనే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు యూపీ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థీ ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో జనవరి 23 వరకు పాఠశాలలను మూసివేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.