Corona:టీకాను ఎదుర్కొనే రకం ఇంకా రాలేదు..కానీ,

కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా కొత్త రకాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహమ్మారి రూపాంతరం చెందుతున్న కొద్దీ టీకాలను సైతం సమర్థంగా ఎదుర్కొనే శక్తి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.....

Published : 25 May 2021 11:13 IST

డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌

జెనీవా: వెలుగులోకి వస్తున్న కరోనా కొత్త రకాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహమ్మారి రూపాంతరం చెందుతున్న కొద్దీ టీకాలను సైతం సమర్థంగా ఎదుర్కొనే శక్తి వాటికి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకు టీకా సామర్థ్యాన్ని తట్టుకోగలిగే వైరస్ రకాలు వెలుగుచూడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. అయితే, భవిష్యత్తుల్లో అలాంటి రకాలు రావని మాత్రం కచ్చితంగా చెప్పలేమన్నారు. కరోనా రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటూనే ఉందన్నారు.

ఈ భయాలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని టెడ్రోస్‌ డబ్ల్యూహెచ్‌ఓ సభ్య దేశాలను కోరారు. సెప్టెంబరు నాటికి ప్రతి దేశంలో కనీసం 10 శాతం మందికి, ఏడాది చివరకు 30 శాతం మందికి టీకాలు అందజేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే వ్యాక్సిన్‌ పంపిణీలో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ సూచించినట్లు టీకాలను సమానంగా, సరైన ప్రాధాన్యక్రమంలో అందించి ఉంటే ఇప్పటికే కరోనాపై పోరులో ముందున్న అన్ని వర్గాలకు టీకా పూర్తిస్థాయిలో అంది ఉండాల్సిందని తెలిపారు.

కొన్ని దేశాల్లో టీకాల కొరత వేధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా టెడ్రోస్ ప్రస్తవించారు. కరోనా వ్యాప్తి విషయంలో మెరుగైన స్థాయిలో ఉన్న దేశాలు చిన్నారులకు టీకాలు ఇవ్వడం నిలిపివేసి ఆ డోసులను మహమ్మారితో కొట్టుమిట్టాడతున్న దేశాలకు పంపాలని పిలుపునిచ్చారు. అత్యధిక టీకాలను కొన్ని దేశాలు మాత్రమే కొనుగోలు చేసి.. చిన్నారులు, ముప్పు తక్కువగా ఉన్న వర్గాలకు సైతం వ్యాక్సిన్లు వేస్తున్నాయని తెలిపారు. దీని వల్ల ఇతర దేశాల్లో మహమ్మారి సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు టీకాలు అందడం లేదని వాపోయారు. డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో టీకాల పంపిణీ కోసం ఏర్పాటైన కొవాక్స్ కూటమి ద్వారా ఇప్పటి వరకు 124 దేశాలకు 70 మిలియన్ల డోసులను అందజేసినట్లు తెలిపారు. అయితే ఇవి ఆ దేశాల్లోని మొత్తం జనాభాలో 0.5 శాతం మందికి మాత్రమే సరిపోతాయని వెల్లడించారు.

ఇప్పటికే భారీ స్థాయిలో టీకాలను నిల్వ చేసుకున్న దేశాలు.. వాటిని మహమ్మారి వ్యాప్తితో అతలాకుతలమవుతున్న దేశాలకు పంపాలని టెడ్రోస్‌ కోరారు. ఇకపై మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. అందుకోసం స్వేచ్ఛాయుత సమాచార మార్పిడి జరగాలని తెలిపారు. కలికట్టుగా ముందుకు సాగితేనే.. ఈ విపత్తులను సమర్థంగా ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని