కరోనా ముప్పు ఎన్నటికీ తొలగిపోదా..?

కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ దశాబ్దాల పాటు మనతోనే ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే, రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత ప్రభావాన్ని ఈ వైరస్‌ చూపించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Published : 11 Mar 2021 18:16 IST

తీవ్రత తగ్గుదలపై నిపుణులు ఏమంటున్నారంటే..

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగుచూసి ఏడాది గడుస్తున్నా పలు దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు విస్తరిస్తోన్న వైరస్‌ ఇంకా ఎన్నిరోజులు ఉంటుందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది. ఇలాంటి సమయంలో కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ దశాబ్దాల పాటు మనతోనే ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే, రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత ప్రభావాన్ని ఈ వైరస్‌ చూపించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

2019 డిసెంబర్‌లో చైనాలో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్‌ ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. భవిష్యత్తులో ఈ వైరస్‌ ఏ విధంగా ప్రవర్తిస్తుందనే విషయాన్ని అంచనా వేయడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. కానీ, ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉన్న వైరస్‌, రాబోయే రోజుల్లో స్వల్ప ప్రభావం చూపే జలుబుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ సోకడం వల్ల లేదా వ్యాక్సిన్‌తో‌ వచ్చే ఇమ్యూనిటీ ఆధారంగా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని, దీంతో వైరస్‌ ప్రభావం తగ్గే అవకాశం ఉందంటున్నారు. మిగతా వైరస్‌ల విజృంభణ, అవి నియంత్రణలోకి వచ్చిన విధానాన్ని ఉదహరిస్తున్నారు.

భవిష్యత్తులో వైరస్‌ ప్రభావం తగ్గుతుందనేందుకు 1918 నాటి స్పానిష్‌ ఫ్లూ ఆధారాలు బలపరుస్తున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పక్షుల నుంచి వ్యాపించిన ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడో వంతు జనాభాకు సోకిందని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) అంచనా వేసింది. వైరస్‌ సోకిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు దానిపై రోగనిరోధకతను సాధించారు. అనంతరం వైరస్‌ వేగంగా వ్యాపించడం తగ్గిపోయింది. తదనంతర కాలంలో తక్కువ తీవ్రత కలిగిన వైరస్‌గా మార్పు చెందిందని సీడీసీ నిపుణులు పేర్కొన్నారు. ఇదే తరహాలో కరోనా వైరస్‌ దశాబ్దాలపాటు ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం బయటపడుతోన్న కొవిడ్‌-19 కొత్తరకం వైరస్‌ల ప్రవర్తనపైనే దీని తీవ్రత ఆధారపడుతుందని చెబుతున్నారు.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు ఇలా ఒక్క మశూచి (స్మాల్‌ఫాక్స్‌) వైరస్‌ని మాత్రమే పూర్తిగా నిర్మూలించగలిగారు. ఆ వైరస్‌ బారినపడడం లేదా వ్యాక్సిన్‌ పొందడం వల్ల పొందిన రోగనిరోధకతోనే ఇది సాధ్యమైందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కొవిడ్‌-19 విషయంలోనూ ఇదే విధంగా జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని