
Schools Reopen: ‘ఆందోళన తగదు.. కరోనా తగ్గుతోన్న ప్రాంతాల్లోనైనా బడులు తెరవాలి’
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా పరిస్థితులు కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో.. పాఠశాలల పునఃప్రారంభంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, కనీసం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న ప్రాంతాల్లోనైనా స్కూళ్లను తెరవాలని దిల్లీలోని సీఎస్‌ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమింగ్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్, ‘సార్స్- కోవ్- 2 వైరస్ ఎవల్యూషన్’పై డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక నిపుణుల బృందం ఛైర్మన్ డా.అనురాగ్ అగర్వాల్ అన్నారు. ప్రజలు ప్రస్తుతం స్వల్ప జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలు నిర్వహించే దశలోకి మహమ్మారి ప్రవేశిస్తోన్నట్లు తెలిపారు. తాజాగా ఓ జాతీయ వార్తాసంస్థతో అగర్వాల్ మాట్లాడుతూ.. పిల్లలను బడులకు దూరంగా ఉంచడం వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ కంటే ఇదే పెద్ద సమస్య అని అభిప్రాయపడ్డారు.
‘పిల్లలకు కొవిడ్‌తో కలిగే అనర్థాల కంటే.. స్కూళ్లకు వెళ్లకపోవడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి కలిగే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి.. వారిని పాఠశాలలకు పంపాలనే విషయమై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అగర్వాల్ వివరించారు. దేశంలో అధిక వ్యాక్సినేషన్ రేటు, మెరుగుపడిన రోగనిరోధక శక్తి, ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండటం తదితర కారణాల నేపథ్యంలో.. ప్రజలు సైతం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడం మేలన్నారు. దేశంలోని అనేక నగరాల్లో మూడో వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకుందని చెబుతూ.. ఫిబ్రవరి ప్రారంభం నాటికి రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని చెప్పారు.
మహమ్మారి ముగింపు దశ(ఎండ్‌గేమ్)పై మాట్లాడుతూ.. ఒకవేళ వైరస్ కనుమరుగు కావడమే ముగింపుగా భావిస్తే.. అది ఇప్పుడే సాధ్యపడదని తెలిపారు. కానీ.. పాఠశాలల పునః ప్రారంభం, చిన్నపాటి జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవడం ఎండ్‌గేమ్‌గా పరిగణిస్తే.. ఇది ఇప్పటికే ప్రారంభమై ఉండాలని చెప్పారు. మున్ముందు కరోనా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులను మాత్రమే ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. వైరస్ భారీగా మార్పులు చెందితే తప్ప.. దాంతో కలిగే నష్టాలు తక్కువేనన్నారు. మరోవైపు.. ఆసుపత్రుల్లో చేరికలకు, మరణాలకు కారణమవుతున్నందున ఒమిక్రాన్‌ను ‘సహజ వ్యాక్సిన్’గా పరిగణించొద్దని హెచ్చరించారు.