కరోనా విలయం: 4కోట్లకు చేరిన కేసులు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తూనే ఉంది. తాజాగా వైరస్‌ కేసుల సంఖ్య 4కోట్ల మైలురాయిని దాటింది.

Published : 18 Oct 2020 23:05 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తూనే ఉంది. తాజాగా పాజిటివ్‌‌ కేసుల సంఖ్య 4కోట్ల మైలురాయిని దాటింది. వీరిలో ఇప్పటివరకూ దాదాపు 3కోట్ల మంది కోలుకోగా మరో కోటి క్రియాశీల కేసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ బయటపడిన వారిలో ఇప్పటివరకు 11లక్షల మంది ఈ వైరస్‌కు బలయ్యారు. అంతేకాకుండా, యూరప్‌ దేశాల్లో రెండో దఫా విజృంభణ మొదలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా తీవ్రత అమెరికాలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 81లక్షల కేసులు బయటపడగా రెండు లక్షల 20వేల మంది మృత్యువాతపడ్డారు. ఇక దక్షిణ అమెరికాలోనూ తాజాగా వైరస్‌ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో ఎక్కువశాతం(భారత్‌ మినహా) ఉత్తర, దక్షిణ అమెరికాల్లోనే సంభవించాయి. ఒక్క బ్రెజిల్‌లోనే లక్షా 54వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికోలో మరో 86వేలమంది మృత్యువాతపడ్డారు. ఇక ఆసియాలో అత్యధికంగా భారత్‌లో 75లక్షల కేసులు నమోదుకాగా లక్షా 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న తొలి మూడు దేశాలు (జాన్స్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకారం)..

దేశం     కరోనా కేసులు      మరణాలు
అమెరికా   81,08,679        2,19,311
భారత్‌     74,94,551        1,14,031
బ్రెజిల్‌     52,24,362        1,53,675 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని