Corona Virus: కరోనా ఇంకా పూర్తిగా పోలేదు.. మాస్క్‌ మరవకండి!

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని.. మాస్క్‌లు ధరించడాన్ని కొనసాగించాలని కోరారు......

Published : 26 May 2022 17:10 IST

ప్రజలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ విజ్ఞప్తి

ముంబయి: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని.. మాస్క్‌లు ధరించడాన్ని కొనసాగించాలని కోరారు. కరోనా వైరస్‌ మన నుంచి పూర్తిగా పోలేదన్న ఆయన.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. మహారాష్ట్ర కేబినెట్‌ వీక్లీ సమావేశం సందర్భంగా ఆయన ప్రజలకు ఈ విజ్ఞప్తి చేసినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. మాస్క్‌ ధరించడంతో పాటు అర్హులైనవారంతా తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఉద్ధవ్‌ కోరారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారిలో 92.27శాతం మంది వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారని.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించినట్టు  పేర్కొన్నారు.

మరోవైపు, మహారాష్ట్రలో మార్చి 5 తర్వాత తొలిసారి నిన్న 470 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క ముంబయిలోనే 295 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి 12 తర్వాత ముంబయిలో ఇంత భారీగా కేసులు రావడం ఇదే  తొలిసారి. మహారాష్ట్రలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.59శాతంగా ఉండగా.. వీటిలో ముంబయి, పుణెలలో రాష్ట్ర సగటు కన్నా అధికంగా ఉంది. ప్రస్తుతం ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. 18 మంది ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నట్టు సీఎంవో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని