Corona virus: మళ్లీ బుసలు కొడుతున్న కరోనా.. ఇవి మరవొద్దు!

కరోనా మహమ్మారి (corona virus) మళ్లీ బుసలు కొడుతోంది. కొన్ని నెలలపాటు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఈ వైరస్‌ తన విజృంభణను ప్రదర్శిస్తోంది.

Published : 22 Jun 2022 19:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా మహమ్మారి (corona virus) మళ్లీ బుసలు కొడుతోంది. కొన్ని నెలలపాటు తగ్గినట్టే తగ్గిన ఈ వైరస్‌.. మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 12,200లకు పైగా కొత్త కేసులు, 13 మరణాలు రావడం.. తాజాగా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ (Bhagat Singh Koshyari), ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) వంటి మరికొందరు ప్రముఖులు కొవిడ్‌ బారిన పడటంతో మరోసారి కలవరం మొదలైంది.

జూన్‌ తొలివారం నుంచి మళ్లీ ఉద్ధృతి..

దేశంలో మార్చి నెలాఖరు నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన కొవిడ్‌ కేసుల ఉద్ధృతి అనూహ్యంగా పెరుగుతోంది. మార్చి 20న దేశవ్యాప్తంగా కేవలం 1761 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్థిరంగా పెరుగుతూ మళ్లీ జూన్‌ ఆరంభంలో భారీ సంఖ్యలో పెరుగుదల నమోదైంది. గత కొన్ని వారాలుగా దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాల్లో భారీగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ వర్షా కాలంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటం మాత్రం ఆందోళనకు కారణమవుతోంది. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుదల నమోదవుతుండగా.. దాదాపు మూడు నెలల తర్వాత తెలంగాణలోనూ నిన్న ఒక్కరోజే 400లకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. గత 24గంటల వ్యవధిలో నమోదైన కేసులతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 81,687కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.94%గా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.90%గా ఉంది.

ఉద్ధవ్‌, కోహ్లీకి కొవిడ్‌ పాజిటివ్‌
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కరోనా బారినపడ్డారు. ఉదయం యాంటీజెన్‌ టెస్టులో పాజిటివ్‌ రాగా.. సాయంత్రం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ సైతం ఈరోజు కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఆయన రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చేరినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్‌ పటేల్‌ కూడా వైరస్‌ బారిన పడ్డారు. ఆర్టీ పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇంకోవైపు, ఇప్పటికే కొవిడ్‌ బారినపడి దిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తాను పూర్తిగా కోలుకొనే దాకా ఈడీ విచారణ నుంచి మినహాయింపు కోరుతూ అధికారులకు లేఖరాశారు. మరోవైపు, టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి కూడా కొవిడ్‌ సోకినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మ, కూమార్తె వామికాతో కలసి విహారయాత్రకు మాల్దీవులకు వెళ్లి వచ్చాక కరోనా బారిన పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హరియాణా హోంమంత్రి అనిల్‌ విజ్‌ కూడా కొవిడ్‌ బారినపడ్డారు. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 2020లో కరోనా బారిన పడిన అనిల్‌ విజ్‌.. దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సపొందారు.

వైద్యరంగ నిపుణుల సూచనలివే..

ప్రజలు కొవిడ్‌ నిబంధనల్ని గాలికొదిలేయడం, బూస్టర్‌ డోసులు వేసుకోకపోవడం వల్లే పలుచోట్ల కేసులు పెరుగుతున్నట్టు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అధిక జనసాంధ్రత కలిగిన భారీ, మెట్రో నగరాల్లోనే ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసుకోవడంతో పాటు భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రం చేసుకోవడం, టీకాలు వేయించుకోవడం వంటివి చేయాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కేసులు పెరుగుతున్నా.. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్‌ ముప్పు నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.

మాస్క్‌ మరవకండి

కరోనాపై పోరాటంలో మాస్క్‌ ధరించడమే తొలి అస్త్రం. కరోనా అలజడి మొదలైనప్పట్నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి లోపించడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు మాస్క్‌లు పెట్టుకొని ఉండటం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చంటున్నారు వైద్యరంగ నిపుణులు. 

టెస్ట్‌.. టెస్ట్‌..టెస్ట్‌.. ప్లీజ్‌!

కొవిడ్‌ అనుమానిత లక్షణాలు కనబడగానే వెంటనే టెస్ట్‌లు చేయించుకోవడంలో వెనకాడొద్దు. ఆలస్యం చేస్తే ఇతరులకు ఈ వైరస్‌ వ్యాప్తి చేసినవాళ్లమవుతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందే మేల్కోనడం ద్వారానే ఈ వైరస్‌ ముప్పు నుంచి బయట పడొచ్చంటున్నారు. కరోనాను గుర్తించి దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టింగే ఏకైక మార్గమని నిపుణులంతా చెబుతున్నమాట. భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ను కట్టడిచేసే వ్యూహాలు అమలు చేయడం మరింత తేలికవుతుంది. అనుమానం వస్తే టెస్ట్‌ చేయించుకోవడమే ఉత్తమం. కొవిడ్ టెస్ట్‌ ఫలితం కోసం వేచి చూడకుండా ఐసోలేట్‌ కావాలి. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలే లేని వారు సైతం పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వైరస్‌ బారిన పడకుండా మేలు చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ సంఖ్యలో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నాయి. 

వ్యాక్సినే బ్రహ్మాస్త్రం..

కరోనాపై యుద్ధంలో టీకాయే బ్రహ్మాస్త్రం‌. టీకా వేసుకోవడం ద్వారా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని మన గత అనుభమే చెబుతోంది. టీకా వేసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌గా వస్తున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటోంది. అందుకే వైద్యరంగ నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా అర్హులైన ప్రతిఒక్కరూ బూస్టర్‌ డోసులు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదనే భరోసా లేనప్పటికీ ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు మాత్రం చాలా స్వల్పం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ సహా అనేక టీకాలు అందుబాటులో ఉన్నాయి. 

రోగనిరోధక శక్తి పెంచుకోండి

మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శరీరానికి తగిన పోషకాహారాన్ని తీసుకోవడం కూడా ఎంతో అవసరం. రోగనిరోధక శక్తిని ఇనుమడింప జేసుకోవడం ద్వారా కరోనా బారినుంచి కొంత వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, మాంసం వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను అనుసరించడం వంటివి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ,బి,సి,డి,ఈ, జింక్‌ వంటి విటమిన్‌లు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా వైరస్‌ ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని