కరోనా వైరస్‌ జీవాయుధం కాకపోవచ్చు!

కరోనా వైరస్‌ జీవాయుధం కాకపోవచ్చు అని కరోనా మూలాలపై అన్వేషణ జరిపిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం అభిప్రాయపడింది.

Updated : 10 Feb 2021 11:58 IST

డబ్ల్యూహెచ్‌ఓ దర్యాప్తు బృందం వెల్లడి

వుహాన్‌: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా కరోనా మూలాలను కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు విఫలమైనట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ జీవాయుధం కాకపోవచ్చు అని కరోనా మూలాలపై అన్వేషణ జరిపిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఇది ఇతర జంతు జాతుల ద్వారా నేరుగా మానవులకు సోకినట్లుగా భావిస్తున్నామని పేర్కొంది. కొవిడ్‌ మూలాలపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం తాజాగా వెల్లడించింది.

‘కరోనా వైరస్‌ తొలుత జంతువుల నుంచే మానవులకు సోకిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వాటి మూలాలను గుర్తించాల్సి ఉంది’ అని చైనాలో దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన లయాంగ్‌ వానియన్‌ పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో కరోనా వైరస్‌ తొలి కేసు బయటపడగా, అంతకు ముందు వుహాన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందనడానికి సరైన ఆధారాలు లభించలేదని వెల్లడించారు. వుహాన్‌ నగరంలో గుర్తించక ముందే ఇతర చోట్ల వైరస్‌ వ్యాపించి ఉండే అవకాశాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య కమిషన్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సమర్థించిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు బెన్‌ ఎంబారక్‌, తొలికేసు నమోదుకాక ముందు వుహాన్‌లో పెద్దగా వైరస్‌ వ్యాప్తి చెందిందనడానికి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

ఇక, కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్‌ నగరంలో వైరస్‌ మూలాలను శోధించేందుకు 14మంది సభ్యులతో కూడిన ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణుల బృందం దర్యాప్తు కొనసాగించింది. ఇందులో భాగంగా వుహాన్‌లో ఉన్న అనుమానిత ల్యాబ్‌తో పాటు చైనాలోని ఇతర ప్రాంతాలల్లో దాదాపు రెండు వారాలపాటు క్షేత్రస్థాయి పర్యటన చేసింది.

ఇదిలాఉంటే, చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి అనతికాలంలోనే యావత్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు పదికోట్ల మంది ఈ వైరస్‌ బారినపడగా, వీరిలో 23లక్షల మంది బలయ్యారు.

ఇవీ చదవండి..

వుహాన్‌: కీలక ఆధారాలు లభ్యం
చైనా కరోనా.. జీవాయుధమేనా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని